సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు
టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరిగింది. అయితే..ఈ భేటీ సందర్భంగా దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ అభిప్రాయాల్ని సీఎంతో పంచుకున్నారు. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని..ఈ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అండగా ఉంటోందని డైరెక్టర్ రాఘవేంద్రరావు ప్రశంసించారు. దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతించారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఆయన కోరారు. యూనివర్సల్ లెవెల్‌లో హైదరాబాద్‌లో స్టూడియో సెటప్ ఉండాలని నాగార్జున వెల్లడించారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే..ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని దగ్గుబాటి సురేష్‌బాబు స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనపైనా చర్చ రాగా..మురళీ మోహన్ మాట్లాడారు. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని, అయినా సంధ్య థియేటర్ ఘటన తమను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. అయితే...వీళ్లందరి అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం రేవంత్...తన వాదననూ వినిపించారు. అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే..ఇకపై సినిమాలకు బెన్‌ఫిట్ షోలు ఉండవని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని వెల్లడించారు.