Inter Exams: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, 7వ ప్రశ్నకు మార్కులు కలపనున్న బోర్డు
TGBIE: రాష్ట్రవ్యాప్తంగా మార్చి 10న జరిగిన ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షలో 7వ ప్రశ్నకు మార్కులు కలుపుతామని ఇంటర్బోర్డు ప్రకటించింది. సమాధానం రాసేందుకు ప్రయత్నించినవారికి 4 మార్కులు ఇవ్వనున్నారు.

Inter English Marks: తెలంగాణలో మార్చి 5న ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రవ్యాప్తంగా మార్చి 10న జరిగిన ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షలో 7వ ప్రశ్నకు మార్కులు కలపనున్నట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఆ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయత్నించిన (అటెంప్ట్ చేసిన) వారికి 4 మార్కులు ఇవ్వాలని ఇంటర్‌బోర్డు ఈ మేరకు నిర్ణయించింది.
ఇంగ్లిష్ క్వశ్చన్ పేపర్‌లో 7వ ప్రశ్నలో ముద్రణ లోపం వల్ల సరిగా కనిపించలేదు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పైచార్టులో ఇచ్చిన శాతాలు స్పష్టంగా ఉన్నా.. వాటిని వివరిస్తూ పక్కన చిన్నబాక్సుల్లో ఇచ్చిన చుక్కలు, గీతలు సరిగా కనిపించలేదు. అనేక పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకురాగా.. తమకు ఇంటర్‌బోర్డు నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, మీరైతే తెలిసిన మేరకు జవాబులు రాయాలని చెప్పారు.
లిఖితపూర్వకంగా ఫిర్యాదు..
ఈ ప్రశ్నకు సంబంధించి జడ్చర్ల తదితర చోట్ల చీఫ్ సూపరింటెండెంట్లకు కొందరు విద్యార్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సబ్జెక్టు నిపుణులతో చర్చించిన అనంతరం.. ఆ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయత్నించిన (అటెంప్ట్ చేసిన) వారికి 4 మార్కులు ఇవ్వాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మార్చి 10న రాత్రి ఒక ప్రకటన జారీ చేశారు. మార్చి 10న నిర్వహించిన ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 4,33,963 మంది హాజరుకాగా.. 13,029 మంది గైర్హాజరయ్యారు.
ఇంటర్‌లో ఇకపై 80 మార్కులకే ఆ పరీక్షలు..
తెలంగాణలో ఇంటర్ విద్యలో సంస్కరణలకు బోర్డు మరోసారి స్వీకారం చుట్టింది. 100 మార్కులకు నిర్వహించే పరీక్షలను ఇకపై 80 మార్కులకే నిర్వహించనున్నారు. మరో 20 మార్కులకు ఇంటర్నల్స్/ప్రాజెక్ట్ వర్క్స్ చేపట్టనున్నారు. ఈ దిశగా ఇంటర్‌బోర్డు నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోంది. అయితే సిలబస్, పరీక్షావిధానంలో మార్పులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సంస్కరణలకు ఇంటర్‌బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే... వచ్చే విద్యాసంవత్సరం నుంచే 80 మార్కులకే ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశముంది.
వీటికి ఇంటర్నల్స్ మార్కులు..
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం 'ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్' పరీక్షను ఇంటర్నల్స్‌గా నిర్వహిస్తున్నారు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను రెగ్యులర్ మార్కులకు కలపడం లేదు. గతంలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను సైతం ఇంటర్నల్ పరీక్ష రూపంలో నిర్వహించేవారు. ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌ను నిర్వహించడంతో ఈ పరీక్షను రద్దుచేసి ప్రస్తుతం బ్యాక్‌లాగ్ విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రతిపాదిత ఇంటర్నల్స్‌లో 20 మార్కులుంటాయి. ఈ మార్కులను రెగ్యులర్ మార్కులకు కలుపుతారు. అసైన్‌మెంట్లు/ప్రాజెక్ట్‌లు విద్యార్థులే సొంతంగా రాయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్, వికీపీడియా నుంచి కాపీకొట్టడానికి వీల్లేదు. చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ సహాయం తీసుకోకుండా విద్యార్థులు సొంతంగా అధ్యయనం చేసి ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా..
✦ అర్థశాస్త్రం (Economics) విద్యార్థులు బడ్జెట్ పాఠంపై ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వీరు కుటుంబ బడ్జెట్, లేదా వ్యక్తిగత బడ్జెట్‌పై ప్రాజెక్ట్‌వర్క్ (Project Work) చేయాలి.
✦ చరిత్ర (History) సబ్టెక్టు చదివే విద్యార్థులు తమ ప్రాంతం లేదా సమీప ప్రాంతంలోని చరిత్ర గురించి ప్రాజెక్ట్‌వర్క్ చేయాల్సి ఉంటుంది.
✦ పొలిటికల్ సైన్స్ (Political Science) చదివే విద్యార్థులు ‘శాసనసభ నిర్మాణం అధికారాలు-విధులు’ పాఠానికి సంబంధించి అసెంబ్లీ నిర్మాణం, తమ నియోజకవర్గ ఎమ్మెల్యేపై ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

