Nara Lokesh : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి లోకేష్‌కు రూ.5 లక్షల ఖర్చు - ఏం జరిగిందో తెలుసా
TDP: ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వ పరంగా తీర్చడం సాధ్యం కాకపోవడంతో లోకేష్ సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ హామీ ఏమిటంటే ?

Lokesh: మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ రూ. ఐదు లక్షలు ఖర్చు పెట్టి హామీ నెరవేర్చారు. ఎన్నికల ప్రచార సమయంలో మంగళగిరి ఎకో పార్క్ లో ఓ సారి ప్రచారం చేశారు. ఆ సమయంలో ఎకో పార్క్ వాకర్స్ అందరూ ఒకటే విజ్ఞప్తి చేశారు. మంగళగిరి ఎకోపార్కులో ప్రవేశరుసుం తొలగించాల్సిందిగా కోరారు. ఎన్నికల్లో గెలిచిన తరవాత ప్రభుత్వం ఏర్పడగానే .. ఈ డిమాండ్ పై పరిశీలన చేసి నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో మంగళగిరి ప్రజలకు హామీ
మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతున్న నారా లోకేష్.. ఎకో పార్క్ హామీ నెరవేర్చడానికి ఇటీవల అటవీ అధికారులతో మాట్లాడారు. అయితే ఫారెస్టుశాఖ పార్కుల్లో రుసుం వసూలు కేవలం నిర్వహణ కోసమేనని, రాష్ట్రవ్యాప్త పాలసీలో భాగమైనందున తొలగించడం వీలుకాదని చెప్పారు. ఒక్క చోట తొలగిస్తే అన్ని చోట్లా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని వల్ల అటవీ శాఖకు భారీగా అదాయం తగ్గిపోతుంది. నిర్వహణ కోసం ఖర్చులు రావు. అందుకే వాకర్స్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి ఎకో పార్కులో మార్నింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే రూ.5లక్షల రూపాయలను నా వ్యక్తిగత నిధులనుంచి చెల్లించినట్లుగా లోకేష్ ప్రకటించారు. ఇకపై మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుం లేకుండా ఉదయం 6నుంచి 9గంటల వరకు ఎకోపార్కులో నడక సాగించవచ్చని లోకేష్ సోషల్ మీడియాలో తెలిపారు.
ఐదేళ్లు ప్రజల్లో ఉండి ఘన విజయం సాధించిన లోకేష్
2019 ఎన్నికల్లో నారా లోకేష్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశారు. కానీ ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఐదేళ్ల పాటు మళ్లీ అదే నియోజకవర్గంలో పని చేశారు. మంగళగిరి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి 90వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో మూడో హయ్యస్ట్ మెజార్టీ సాధించారు. చాలా కాలం నుంచి మంగళగిరిలో టీడీపీ గెలవలేదు. ఐదేళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి.. వారికి కావాల్సిన అవసరాలు చూస్తూ వారి సమస్యల కోసం పోరాడుతూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన చాలా హామీలు ఇచ్చారు. ఈ హామీల అమలుకు ప్రయత్నిస్తున్నారు.
ఒక్క ఏడాదికే ఐదు లక్షలు.. మరి ఏడాది తర్వాత ?
చాలా సమస్యలు ప్రభుత్వ పరంగా పరిష్కరించగలిగినవే అయినా.. కొన్ని విషయాల్లో మాత్రం వ్యక్తిగత నిధులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అటవీ శాఖలోని ఎకో పార్క్ కు ఆయన తన పవర్ ను ఉపయోగించి.. హామీని అమలు చేయవచ్చు కానీ ఆ ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుంది. అందుకే ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది.అయితే ఇది ఏడాదికి మాత్రమే.. ప్రతీ ఏడాది కట్టాల్సి వస్తుంది. కానీ లోకేష్ ప్రతీ ఏడాది కడతారా లేదా అన్నది మరో ఏడాది తర్వాత స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.





















