Rohit Sharma on Champions Trophy Victory: ఓటమి లేకుండా ఓ టోర్నమెంట్ గెలవడం గొప్ప విజయమే: ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుపై రోహిత్ శర్మ
ICC Champions Trophy 2025 | రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా రెండు వరుస ఐసీసీ మేజర్ ట్రోఫీలు నెగ్గింది. అయితే ఓటమి లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంపై రోహిత్ శర్మ స్పందించాడు.

India Wins Champions Trophy 2025 | ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా రెండో ఐసీసీ టోర్నమెంట్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో విజయంతో పాటు గత మేజర్ టోర్నీల్లో ఫలితాలు, తన కెరీర్ ప్లాన్లపై రోహిత్ శర్మ జియోహాట్‌స్టార్ (Jio Hotstar)తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఓటమి లేకుండా గెలుచుకున్న అనుభవాన్ని పంచుకున్నారు.
ఓటమి లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంపై..
"మేం 5 టాస్‌లు కోల్పోయినా ఒక్క ఓటమి కూడా లేకుండా ట్రోఫీ గెలిచాం. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటీ ఓడిపోలేదు. ఓటమి లేకుండా టోర్నమెంట్ గెలవడం గొప్ప విజయమే. నిజం చెప్పాలంటే, ట్రోఫీ గెలిచే వరకు దీని గురించి ఎవరూ ఎక్కువగా ఆలోచించలేదు. కానీ, గెలిచిన తర్వాత ఆ నిజం మనసుకు తాకింది. మేం మొత్తం టోర్నమెంట్‌ను ఓటమి లేకుండా పూర్తి చేశాం. అది నిజంగా ప్రత్యేకమైన ఫీలింగ్. దీన్ని మాటల్లో చెప్పలేం. మా జట్టు చాలా బలంగా ఉంది, ఈ విధమైన అంకితభావంతో ఆడే ఆటగాళ్లతో కలిసి ఆడటం ఆనందంగా ఉంది.
ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను అర్థం చేసుకొని సమష్టిగా రాణించారు. మైదానంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నేను అతి ఉత్సాహంతో ఉంటాను. కానీ, అది ఆటలో భాగమే. స్టేడియంలో చెప్పిన మాటలు ఎవరినైనా బాధించాలనే ఉద్దేశంతో మాత్రం కాదు. అది ఆటపై ఉన్న ప్రాముఖ్యతను చూపుతుంది. మేమంతా కలిసి చాలా కాలంగా ఆడుతున్నాం, అందుకే ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటాం. చివరకు, మా లక్ష్యం ఒక్కటే కప్పు గెలవడం. అందుకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ టోర్నమెంట్‌లో మా ఆటగాళ్లు అదే నిరూపించారు. జట్టు కోసం ఏదైనా చేస్తామని నిరూపించారు’ అని రోహిత్ శర్మ అన్నారు.
జస్ప్రిత్ బుమ్రా గైర్హాజరీని ఎలా ఎదుర్కొన్నారు..
"జస్ప్రిత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని మాకు ముందుగానే అర్థమైంది. అతని గాయం పరిశీలిస్తే, తను ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం కావడం కష్టమే. అతను ఫాస్ట్ బౌలర్ కావడంతో, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్ సిరీస్ కోసం సిద్ధమవుతూనే, ఛాంపియన్స్ ట్రోఫీకి తుది జట్టును రూపొందించే సమయంలో మేం ఈ సమస్యను ముందే పసిగట్టి నిర్ణయం తీసుకున్నాం.
మరో స్టార్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులో ఉండటం చాలా కీలకంగా మారింది. అతను ఐసీసీ టోర్నమెంట్లలో మంచి రికార్డు కలిగిన బౌలర్. గత వరల్డ్ కప్‌లను పరిశీలిస్తే, షమీ చాలా మంచి ప్రదర్శన కనబరిచాడు. అందుకే, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అతని ఆటతీరును పరిశీలించినప్పుడు, బుమ్రా లేకున్నా మాకు షమీతో ఫలితాలు రాబడతామని నమ్మకం వచ్చింది.
ఇంకా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలపై కూడా మాకు నమ్మకం ఉంది. మేం ప్లానింగ్ సమయంలో వారి పాత్రలను స్పష్టంగా అర్థం చేసుకునేలా చేశాం. మరో ముఖ్యమైన అంశం ప్రిపరేషన్. ఆస్ట్రేలియా టూర్ తర్వాత, టోర్నమెంట్ ప్రారంభమయ్యేలోపు 20-25 రోజులు గడిచాయి. ఆ సమయంలో, ILT20 మ్యాచ్‌లను చూసి, పిచ్ పరిస్థితులను విశ్లేషించాం. ఆ డేటాను ఉపయోగించి మా బౌలింగ్ లైనప్‌ను సిద్ధం చేసుకున్నాం. అన్ని అంశాల సమ్మేళనంతోనే, బుమ్రా లేకపోయినా మంచి ప్రదర్శన ఇవ్వగలిగాం."
2015 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఓటమి తర్వాత..
"గతంలో మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో మంది చర్చించిన విషయం ఇది. ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ వరకు వెళ్లి చివర్లో ఓడిపోవడం దురదృష్టకరం. 2015 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ముందు మ్యాచ్‌ల్లో చేయని కొన్ని పొరపాట్లు చేశాం. అదే తేడా కొట్టింది. అదే 2016, 2017 ICC టోర్నమెంట్లలోనూ జరిగింది. కొన్ని సందర్భాల్లో అదృష్టం మా వైపు లేదు. కానీ 2023 వన్డే ప్రపంచ కప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు అద్భుతంగా ఆడినా, ఫైనల్లో ప్రతికూల ఫలితం వచ్చింది.
అందుకే 2023 వన్డే ప్రపంచ కప్ ముందు మేము మా మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చాం. వ్యక్తిగత రికార్డుల గురించి కాకుండా, జట్టు విజయం మాత్రమే ముఖ్యమని భావించాం. 2019 ప్రపంచకప్‌లో నేను 5 సెంచరీలు చేశాను. కానీ, కప్పు గెలవలేదు. నేను ఆ సెంచరీలను నా ఇంట్లో ఫ్రేమ్ చేసుకొని ఉంచుకున్నా, పక్కన ప్రపంచకప్ ట్రోఫీ లేదు. వ్యక్తిగత విజయాల కన్నా, జట్టు విజయాల్లోనే ఆటకు ప్రాముఖ్యత ఉంది. అందుకే, గత కొన్నేళ్లుగా మేం మా ప్రాధాన్యతలను మార్చుకున్నాం. ఇది సాధించడానికి, జట్టు మొత్తం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, జట్టు మొత్తం ఈ మార్పును అంగీకరించాలి. మా ఆటగాళ్లందరికీ దీనికి క్రెడిట్ ఇవ్వాలి. వారు కొత్త ఆలోచనను అర్థం చేసుకొని, విజయాన్ని సాధించేందుకు కృషి చేశారు."
భారత జట్టును ఇతర టీమ్స్ ఎలా చూడాలి..
"ఇతర జట్లు మనల్ని ఎలా చూడాలో నేనే చెప్పలేను. కానీ, ఒక విషయం మాత్రం కోరుకుంటాను. మమ్మల్ని అంత తేలికగా తీసుకోకూడదు. మేము 5 వికెట్లు కోల్పోయినా, తిరిగి పోరాడగలమని ఫీల్ కావాలి. చివరి బంతి పడేంతవరకు ప్రతీ జట్టు మన presenceను ఫీలవ్వాలి. బౌలింగ్‌లోనూ ఇదే తపన ఉంటుంది. మనం ఎన్నోసార్లు పోరాడి విజయాలు సాధించాం. అదే లెగసీ కొనసాగించాలని అనుకుంటున్నాం. మా జట్టు క్లిష్టమైన పరిస్థితుల్లోనూ తిరిగి కమ్ బ్యాక్ చేస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి."
తన ఫ్యూచర్ ఫ్లాన్స్‌పై రోహిత్..
"ప్రస్తుతం, నేను నా ఆటపై దృష్టి పెడతాను. 2027 వరల్డ్ కప్ గురించి ముందుగా ఆలోచించడం లేదు. ఇప్పటికిప్పుడు నేను ఏదైనా తేల్చేయడం కరెక్ట్ కాదు. నా దృష్టి ప్రస్తుతం నా ఆటను ఆస్వాదించడంపై ఉంది. ఆటగాళ్లు కూడా నన్ను వారి జట్టులో భాగంగా ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికి అదే ముఖ్యం." అని రోహిత్ శర్మ కీలక విషయాలు షేర్ చేసుకున్నారు.





















