ఈ దుంప పేరేంటో తెలుసా? వనవాసంలో శ్రీరాముడు తిన్న ఆహారం ఇది
ఈ కంద మూల పండు ఎక్కడ కనిపించినా కచ్చితంగా కొనుక్కొని తినండి.
Ram kand mool fruit: శ్రీరాముడు వనవాస సమయంలో తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణునితో పద్నాలుగేళ్ల పాటు అడవిలోనే జీవించాడు. ఆ సమయంలో ఆయన అధికంగా తిన్న ఆహారంగా దీన్ని చెప్పుకుంటారు. దీన్ని ప్రధానంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోనే పండిస్తారు. డ్రమ్ము ఆకారంలో కనిపించే దుంప ఇది. దీన్ని రామ్ కంద్ మూల్ అని పిలుస్తారు. ఉత్తర భారత దేశంలో దీన్ని రాంకంద్, రామచంద్ర కంద్ మూల్ అని కూడా అంటారు. ఇక తమిళనాడులో బుమి చక్కెరైవల్లి కిజంగు అని పిలుస్తారు. ఇది అరుదైన దుంప మాత్రమే కాదు. చాలా ప్రాచీనమైనది కూడా. దీన్ని ఒకప్పుడు ప్రజలు చిరుతిండిగా తినేవారు. ఇప్పుడు ఇది చాలా అరుదుగా లభిస్తుంది. ఆయుర్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది.
వివిధ వ్యాధుల చికిత్సలో భాగంగా ఈ కందమూలాన్ని ఆయుర్వేదంలో వినియోగిస్తారు. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. వనవాసంలో శ్రీరాముడు ఈ కందమూలాన్ని తినడం వల్లనే సర్వ ఆరోగ్యవంతుడిగా ఉన్నారని చెబుతారు. దీన్ని ఇప్పటికీ రోడ్డుపైన అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు. చిన్న ముక్కలుగా కోసి అందిస్తారు. దీని రుచి తీపిగా ఉంటుంది. పైన కొద్దిగా చక్కెర జల్లుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ కంద్ మూల దుంపను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణాశయ రుగ్మతలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. జీర్ణశయంలో స్రవించేలా ప్రేరేపిస్తుంది. దీనివల్ల పోషకాల శోషణ పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పేగు కదలికలను నియంత్రించడంలో ఇది ముందుంటుంది. కంద్ మూల దుంపలో ఉండే సుగుణాలు దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాంటివి వచ్చినప్పుడు దీన్ని తింటే వాటిని త్వరగా తగ్గేలా చేస్తాయి.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు దీన్ని కచ్చితంగా తినాలి. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడమే కాదు కీళ్ల వాపును కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఆర్థరైటిస్ బారిన పడినవారు దీన్ని కచ్చితంగా తినాలి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా తగ్గుతుంది.
శరీరం నుంచి వ్యర్థాలను, విష పదార్థాలను తొలగించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇది సహాయపడుతుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరుకు ఇది ఎంతో మద్దతుగా నిలుస్తుంది. ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా ఇది ముందుంటుంది. ఇది పొడి రూపంలో కూడా అమ్ముతారు. ఇది మార్కెట్లలో లభిస్తుంది. దీన్ని ఔషధంగా తీసుకోవచ్చు. మిల్క్ షేక్ లు, స్మూతీలు తయారు చేసుకున్నప్పుడు దీన్ని కలుపుకొని తాగితే ఎంతో మంచిది. ఈ పొడిని వేసిన నీళ్లను 10 నిమిషాలు మరగబెట్టి అందులో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.