Pawan Kalyan: కూటమి అంటే ఓ కుటుంబం, ఆయన మాటలు మా అందరికీ ఆదర్శం: వైసీపికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
AP Assembly Sessions | కూటమి ప్రభుత్వం అంటే ఓ కుటుంబం లాగ అని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏపీ ప్రజల కోసం బలంగా నిలబడి పోరాడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

Andhra Pradesh News Today | అమరావతి: వైసీపీ నాయకులకు తగిన గౌరవం ఇవ్వాలని ఎన్నికల్లో విజయం అనంతరం మొదటి అసెంబ్లీ సమావేశంలోనే సీఎం చంద్రబాబు (Chandrababu) అందరికీ చెప్పారని, అదే బాధ్యతతో తాము మెలుగుతున్నాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తొలిరోజు సభలో వైసీపీ చేసిన రార్ధాంతానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇబ్బందిపడి ఉంటే ఆయనకు ఏపీ ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులోనూ తాము ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తితో సభలో హుందాతనం ప్రదర్శిస్తాం అన్నారు.
కూటమి అంటే కుటుంబం.. విభేదాలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ
సంకీర్ణ ప్రభుత్వంలో చాలా సవాళ్లు ఉంటాయని.. రకరకాల మాటలు, అభిప్రాయాలు ఉంటాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలను, పార్టీలపై ఎన్నిరకాలుగా మాట్లాడినా తామంతా కలిసి ఒకే కుటుంబంలా ఉంటామని బలంగా చెబుతున్నాం అని వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే బాథ్యతను బలంగా తీసుకున్నామని, ఇబ్బందులు వచ్చినా ప్రజల కోసం బలంగా నిలబడి ఉంటామన్నారు. సింగపూర్ మొదటి ప్రధాని లీ క్వాన్ యూ మాటలే తమకు ఆదర్శం అన్నారు. విభిన్న అంశాల పట్ల స్వీయ నియంత్రణతో బలంగా చర్చ జరగాలి అని నమ్ముతానన్నారు.
‘అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పార్టీ (YSRCP) ముఖం చాటేసింది. ఇలాంటి పరిస్థితిలో ప్రజల కోసం అధికార పక్షమే ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఏపీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మెరుగైన జీవన విధానం కోసమే ఆలోచిస్తాను. ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేసి రాష్ట్రాభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్న గవర్నర్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు’ తెలిపారు పవన్ కళ్యాణ్.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీది నాటకం
గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకునేందుకు బదులుగా, ప్లాట్లుగా చేసి అమ్మేసేందుకు పన్నాగం పన్నింది. గత ఐదేళ్లలో కేంద్రానికి అన్ని బిల్లుల్లోనూ మద్దతు ఇచ్చిన వైసీపీ ఎంపీలు కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. విశాఖ స్టీల్ ప్లాంటు పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం మొగ్గు చూపితే వైసీపీ అప్పట్లో మద్దతు తెలిపింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ మేం కేంద్రాన్ని కోరాం. 2024లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాత ప్రైవేటీకరణ వద్దని, ప్లాంటుని కాపాడాలని సీఎం చంద్రబాబు, నేను పలుమార్లు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి ఆర్ధిక సాయాన్ని పొందడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసా కల్పించామని పవన్ కళ్యాణ్ అన్నారు.
పోలవరం నిర్మాణానికి, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు చెబుతున్నాను. రాష్ట్రానికి మళ్లీ కొత్త కంపెనీలు, పరిశ్రమలు వస్తున్నాయి. వాటి ద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వికసిత్ భారత్ లో ఏపీని ముందు వరసలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు.






















