Telangana cabinet : కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్- విజయశాంతి సహా ముగ్గురు ఇన్; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
Telangana cabinet:కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ, అనుకున్న రీతిలో ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు రాలేదన్న అసంతృప్తిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana cabinet Reshuffle : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముందు మంత్రిగా అజారుద్ధీన్‌ను క్యాబినెట్‌లో తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఈ ఎన్నిక తర్వాత మంత్రివర్గ మార్పులు చేయనున్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తా కథనాలను కాంగ్రెస్ పార్టీ ఖండించడం లేదు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కొంత వెనుకబడిందని హస్తం నేతలు అంతర్గతంగానే చర్చించుకుంటున్నారు. అయితే, ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఫలితాలు రాకపోతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొద్ది మంది మంత్రులకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికే అవకాశాలున్నాయన్న చర్చ సాగుతోంది.
క్యాబినెట్ ప్రక్షాళనకు కారణాలు ఇవేనా...?
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ, అనుకున్న రీతిలో ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు రాలేదన్న అసంతృప్తిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత ఫ్రీ బస్, రైతులకు పెంచిన ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటివి అందిస్తున్నా ప్రజల్లో అనుకున్నంత పాజిటీవ్ వేవ్ పార్టీకి లేదని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ఆరు గ్యారంటీల్లో ఇతర పథకాలు ఇంకా పట్టాలు ఎక్కలేదు. వీటిపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. వీటిని ప్రతిపక్షాలు ప్రతీ వేదికపై చెబుతూ ప్రజల్లోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు మంత్రుల పనితీరుపైన పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి మితిమీరిన స్వాతంత్రంతో చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయన్న భావనలోనూ హైకమాండ్ ఉంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాతే ఎందుకు..?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్‌కు అనుకున్న ఫలితం వచ్చేలా లేదన్న భావంతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత సర్వేలు కూడా ఆశించిన రీతిలో లేవని హస్తం నేతలు చెబుతున్నారు. అటు మైనార్టీ వర్గాలను మచ్చిక చేసుకునేందుకు ఎం.ఐ.ఎం.తో దోస్తీ, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వంటి చర్యలు చేపట్టినా ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీనే ముందంజలో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. వారే కాకుండా బయటి సర్వేలు కూడా ఇదే అంశాన్ని ప్రస్పుటం చేస్తున్నాయి. అయినా సీఎం రేవంత్ రెడ్డి తన శక్తివంచన లేకుండా పార్టీని గెలిపించేందుకు ప్రచారంలోకి దిగినప్పటికీ, ఏం జరుగుతుందో అన్న భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అయితే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమి పాలైతే, అది పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన ఆ ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తోంది. ఇదే జరిగితే పార్టీని రెండో సారి అధికారంలోకి తేవడం అంత సుళువు కాదన్న విషయాన్ని పసిగట్టిన పార్టీ పెద్దలు క్యాబినెట్ ప్రక్షాళన చేయడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. క్యాబినెట్ మార్పుల ద్వారా ప్రజల అసంతృప్తిని కొంచెం తగ్గించడమో, డైవర్ట్ చేయడమో చేయవచ్చన్న వ్యూహంతో పార్టీ పెద్దలు ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు.
ఎవరిపై వేటు? ఎవరికి అవకాశం?
అయితే ప్రస్తుతం ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరికి క్యాబినెట్ నుంచి ఉద్వాసన చెబుతారన్న దానిపై పూర్తి స్పష్టత లేకున్నా, పార్టీలో మాత్రం కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖను తప్పించి, ఆమె స్థానంలో విజయశాంతికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించి, ప్రస్తుత చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎంతో నేరుగా తలపడిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉద్వాసన తప్పదన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. ఆయన స్థానంలో మరో బలమైన సామాజిక వర్గం నుంచి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక కోమటి రెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చన్న చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకోలేదని విమర్శలు చేస్తున్నారు. ఈ టైంలో కుటుంబానికి ఒకే పదవి' అన్న పార్టీ లైన్ ప్రకారం కోమటి రెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.






















