Road Accidents in AP and Telangana: వణుకు పుట్టిస్తున్న వరుస రోడ్డు ప్రమాదాలు.. ఏపీ, తెలంగాణలో తాజాగా 4 చోట్ల యాక్సిడెంట్స్
Andhra Pradesh Road Accidents | కర్నూలులో రోడ్డు ప్రమాదం మరువకముందే చేవెళ్లలో మరో ఘోరం జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులకు వణుకు పుట్టిస్తున్నాయి.

Anantapur Road Accident | అనంతపురం: వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. కొన్ని నెలల కిందట వరుస రైళ్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ తరువాత విమాన ప్రమాదాల వంతు అయింది. తాజాగా ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాలో వి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 20 మంది వరకు చనిపోయారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఏపీలో, తెలంగాణలో పలు చోట్ల మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 
జబ్బార్ ట్రావెల్స్ బస్సు, ఐచర్ వాహనం ఢీ..
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు, ఐచర్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలం, దామాజిపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.

కరీంనగర్‌లో ట్రాక్టర్, బస్సు ఢీ
కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకున్నాయి. తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

ఏలూరు జిల్లాలో ట్రావెల్స్ బోల్తా
లింగపాలెం: ఏలూరు జిల్లాలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీనగర్ దగ్గర భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. లింగపాలెం శివారు జూబ్లీ నగర్ టర్నింగ్లో భారతి ట్రావెల్ బస్సు కంట్రోల్ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తాపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో పది మందివరకు గాయపడ్డారు. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లాలో అద్దంకి, నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక వైపు నుంచి ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది వరకు ఉన్నారని సమాచారం.






















