Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
అమెరికా ఎన్నికల్లో మరో సారి భారతీయ జెండా రెపరెపలాడింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక జరిగిన ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు భారీ విజయాలు సాధించి ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్లకు షాక్ ఇచ్చారు. ప్రత్యేకించి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా గజాలా హష్మీ ఘన విజయాన్ని అందుకున్నారు. ఫలితంగా వర్జీనియాకి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన తొలి ముస్లింగా ఆమె రికార్డు సృష్టించారు. అయితే అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే గజాలా హష్మీ మూలాలు మన హైదరాబాద్ కు చెందినవి. 1964లో హైదరాబాద్ లో మలక్ పేట్ లో గజాలా హష్మీ జన్మించారు. ఆమె తాతగారింట్లోనే చిన్నప్పుడు పెరిగారు. గజాలాకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లితండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లిన గజాలా హష్మీ అక్కడే చదువుకుని ప్రొఫెసర్ గా పలు యూనివర్సిటీల్లో ఉన్నతోద్యోగాలు చేసి 2019లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2024లో సెనేట్ ఎడ్యుకేషన్ కమిటీ ఛైర్మన్ అయిన గజాలా హష్మీ ఇప్పుడు ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో విజయం సాధించి ఈ ఘనత సాధించిన తొలి ముస్లింగా, తొలి సౌత్ ఏషియన్ అమెరికన్ గా...తొలి భారతీయ సంతతి మహిళగా రికార్డు సృష్టించారు.





















