Gollapalli Surya Rao Health Update: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్య పరిస్థితి!
మాజీ మంత్రి, వైసిపి రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యరావుకు గుండెపోటుకు గురయ్యారు. నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఉండగా అస్వస్థతకు గురైన సూర్యారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Gollapalli Surya Rao Health Update: మాజీ మంత్రి, వైసిపి రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యరావుకు గుండెపోటుకు గురయ్యారు. రాజోలు నియోజకవర్గం శివకోటిలో కార్యకర్తల సమావేశంలో ఉండగా అస్వస్థతకు గురైన సూర్యారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇది గమనించిన పార్టీ నాయకులు హుటాహుటీన అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో రెండు చోట్ల బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారించి స్టంట్లు వేయాల్సి ఉందని తెలపడంతో అత్యవసర చికిత్సలో భాగంగా రెండు స్టంట్లు వేశారని కుటుంబికులు తెలిపారు.
రాజోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న ఆయన పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన ఇటీవల కాలంలో అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అ రాష్ట్రంలో వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శివకోటి గ్రామంలో ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరించే కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిపై బుధవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో సూర్యారావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లు వైసీపీ నాయకులు తెలిపారు.
నిలకడగా మాజీ మంత్రి సూర్యారావు ఆరోగ్యం..
గుండెపోటుకు గురైన సూర్యారావును అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు హార్ట్ రక్త ప్రసరణ చేసే రక్తానాళాల్లో క్లాట్‌లను తొలగించి రెండు స్టంట్ వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సూర్యారావు అరోగ్యం నిలకడగా ఉండగా ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. ఆయన ఆసుపత్రి అత్యవసర విభాగంలో కోలుకుంటున్నారు. అమలాపురానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ అభిషేక్ వర్మ సారధ్యంలో వైద్యులు చికిత్స అందించారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న సూర్యారావును కిమ్స్ ఆసుపత్రి ఛైర్మన్ కలిదిండి చైతన్యరాజు పరామర్శించి ధైర్యంచెప్పారు. అదేవిధంగా వైసీపీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం వైసీపీ ఇంచార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్, వైసీపీ యువజన నేత నేతల నాని తదితర నాయకులు గొల్లపల్లి సూర్యారావును పరామర్శించారు.
వృద్ధాప్యంలోనూ యాక్టివ్‌గా..
ఇటీవల వైసీపీ నిర్వహించిన దాదాపు అన్ని నిరసన కార్యక్రమాల్లోనూ గొల్లపల్లి సూర్యారావు యాక్టివ్‌గా ఉన్నారు. సూర్యారావుకు ప్రస్తుతం 70 ఏళ్లు పైబడే ఉంటాయి. అయినా రాజోలు నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎన్నికలకు ముందు రాజోలు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా వ్యవహరించిన సూర్యారావు రాజోలు సీటు జనసేనకు దక్కడంతో చివరి నిమిషంలో వైసీపీ తీర్ధం పుచ్చుకుని సీటు దక్కించుకున్నారు. అయితే ఆయన ఓటమి పాలవ్వగా అప్పటి నుంచి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవలే రాజోలు నియెజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్యను టీడీపీ అధిష్టానం నియమించింది. ప్రస్తుతం తండ్రీ కూతుర్లు మధ్య మాటలు లేనట్లు సమాచారం.






















