ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ క్షమాపణలు చెప్పాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయినందుకు మన్నించాలంటూ ఇన్‌స్టాలో ఓ లెంతీ పోస్ట్ చేశాడు. 2 టెస్ట్‌ల సిరీస్‌కి రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో దూరమవడంతో వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ జట్టును నడిపించాడు. అయితే కానీ 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ఘొర పరాజయాన్ని టీమిండియా మూటగట్టుకోవడంతో రిషబ్ పంత్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పాడు. 'గత రెండు వారాలుగా మేం సరిగ్గా ఆడలేదనే విషయాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు. జట్టుగా.. వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని, కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావాలని కోరుకుంటాం. కానీ ఈ సారి మేం మీ అంచనాలను అందుకోలేకపోయాం.
కానీ క్రీడల్లో ఓటమి ఎప్పుడూ జట్టుగా.. వ్యక్తిగతంగా గుణపాఠం నేర్పడమే కాకుండా.. మరింత మెరుగవ్వాలని చెబుతుంది. భారత్ దేశానికి ప్రాతినిథ్యం వహించడం జీవితంలో మాకు దక్కిన అతిపెద్ద గౌరవం. జట్టు సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. మేం ఇంకా కష్టపడతాం. ఆటపై మరింతగా ఫోకస్ చేస్తాం. వ్యక్తిగతంగా, జట్టుగా బలంగా తిరిగి వస్తాం. మీ నుంచి లభిస్తున్న గొప్ప సపోర్ట్‌కి, ప్రేమకు థ్యాంక్స్. జైహింద్' అంటూ పంత్ తన సుదీర్ఘ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే సఫారీ జట్టుతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రెండో టెస్ట్‌లో ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో టీమిండియా చిత్తుగా ఓడటం భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ని సౌతాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా.. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ గెలిచి రికార్డ్ సృష్టించింది. గతేడాది కూడా న్యూజిల్యాండ్ చేతిలో భారత్ ఇదే తరహాలో దారుణంగా వైట్‌వాష్‌కి గురైంది. ఇలా సొంతగడ్డపై రెండు టెస్ట్ సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ కావడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు ఆటగాళ్లపై కూడా విపరీతంగా విమర్శలొస్తున్నాయి. అందుకే పంత్ ఈ పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ని కొంత కూల్ చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.




















