NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. 63.12 లక్షల పింఛన్‌దారులకు రూ .2743.99 కోట్లు పంచి పెట్టనుంది.

NTR Bharosa Pensions: నూతన సంవత్సరం సందర్బంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు ఒక రోజు ముందుగా అనగా 31 డిసెంబర్ 2025వ తేదీన అందజేయడం జరుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛన్‌దారులకు రూ.2743.99 కోట్లు సచివాలయ సిబ్బంది పింఛన్‌దారుల ఇంటివద్దనే పంపిణి చేయటం జరుగుతుందన్నారు. డిసెంబర్ 31 2025 తేదీన పంపిణి కాకుండా మిగిలిన పెన్షన్‌లను జనవరి 2న సచివాలయ సిబ్బంది పింఛన్‌దారుల ఇంటివద్దనే పంపిణి చేయటం జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియచేశారు.
పెన్షన్ లు తగ్గించారా... ఫ్యాక్ట్ చెక్ ఏం చెబుతోంది
ఇటీవల కాలంలో పెన్షన్స్ కోత పెట్టారనే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో జరుగుతున్న ప్రచారంఫై ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇండియాలో ఏ రూ.33,000 కోట్లు కేవలం పింఛన్‌ల కోసం కేటాయిస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అనీ ఈ డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి 2,739 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో అందించడం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. వివిధ కారణాల వల్ల గత 2 నెలలుగా పెన్షన్ తీసుకోని 1,39,677 మందికి కూడా రెండు నెలలకు కలిపి రూ.114 కోట్లు, 3 నెలలుగా పెన్షన్ తీసుకోని 13,325 మందికి రూ.16 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఫ్యాక్ట్ చెక్ టీమ్ వివరణ ఇచ్చింది..
ప్రభుత్వం చాలా నిబద్ధతతో సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తుంటే కొంత మంది సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడం, ప్రజలకు మిస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సరికాదని ఇలాంటి దుష్ప్రచారాన్ని నిలుపుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. ఇక కొత్త ఏడాది సందర్బంగా ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 31నే సామాజిక భద్రత పెన్షన్‌లను అర్హులకు అందజేయనున్నట్టు ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.





















