PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
PPP tenders : ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ టెండర్లలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వచ్చిన ఒక్క టెండర్‌ను తాము వేయలేదని కిమ్స్ ప్రకటించింది.

PPP tenders for AP government medical colleges: ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీ టెండర్ల విషయంలో అనేక కష్టాలు పడుతోంది. ఓ వైపు అవినీతి అని వైసీపీ విమర్శిస్తూంటే మరో వైపు టెండర్లు వేసేందుకు ఒక్కరూ రావడం లేదు. నాలుగు మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్క ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రం కిమ్స్ టెండర్ వేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కిమ్స్ కూడా తాము టెండర్ వేయలేదని ప్రకటించడం ప్రభుత్వానికి షాక్‌కు గురి చేసింది.
ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి జరిగిన టెండర్ల ప్రక్రియలో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గందరగోళం ఏర్పడిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ టెండర్లలో కిమ్స్ సంస్థ బిడ్ వేసిందని ఒకవైపు, అసలు తాము బిడ్ వేయలేదని కిమ్స్ యాజమాన్యం ఖండించడంపై నెలకొన్న సందిగ్ధతకు ఆయన తెరదించారు. డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద ఈ టెండర్ దాఖలైందని, ఆయన కిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తుండటం వల్లే ఈ గందరగోళం తలెత్తిందని మంత్రి స్పష్టం చేశారు.
నిజానికి, ప్రభుత్వం పీపీపీ విధానంలో నాలుగు మెడికల్ కాలేజీలు ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కోసం టెండర్లు పిలవగా, కేవలం ఆదోని కాలేజీకి మాత్రమే ఒక బిడ్ దాఖలైంది. ఈ బిడ్‌ను డాక్టర్ ప్రేమ్ చంద్ సమర్పించారు. ఆయన కిమ్స్ గ్రూప్‌లో భాగస్వామి లేదా అక్కడ పనిచేస్తున్న వ్యక్తి కావడం వల్ల అది కిమ్స్ వేసిన టెండర్‌గా రికార్డుల్లోకి వెళ్లిందని మంత్రి వివరించారు. కిమ్స్ సంస్థ అధికారికంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి బిడ్ వేయలేదని వచ్చిన ప్రకటనను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఈ టెండర్ల ప్రక్రియలో ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడానికి ప్రతిపక్ష పార్టీల బెదిరింపులే కారణమని మంత్రి సత్య కుమార్ ఆరోపించారు. పీపీపీ విధానం ద్వారా వచ్చే సంస్థలను తాము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెడతామని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించడం వల్లే ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారని మండిపడ్డారు. అయినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ముందుకు వచ్చిన ఏకైక బిడ్డర్‌తో చర్చలు జరిపి పనులు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
రాష్ట్రంలో వైద్య విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో కాలేజీలు వచ్చినా వాటిపై పూర్తి అజమాయిషి ప్రభుత్వానిదే ఉంటుందని, పేద విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు. మిగిలిన మూడు కాలేజీలకు సంబంధించి టెండర్ల నిబంధనలను కొంత సడలించి, మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన సూచించారు.మరో వైపు పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలను నిర్వహించడానికి నలభై శాతం సబ్సిడీ తాము భరిస్తామని కేంద్రం కూడా ఆఫర్ ఇచ్చారు. దీంతో మరిన్ని మినహాయింపులతో మరోసారి టెండర్లు పిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.





















