Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
Psych Siddhartha Review Telugu: శ్రీ నందు హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా మారిన సినిమా 'సైక్ సిద్ధార్థ'. జనవరి 1న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
వరుణ్ రెడ్డి
శ్రీ నందు, యామినీ భాస్కర్, ప్రియాంకా రెబెకా శ్రీనివాస్, సింహ ఎన్, సుఖేష్ రెడ్డి తదితరులు
Psych Siddhartha Review In Telugu: శ్రీ నందు హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా మారిన సినిమా 'సైక్ సిద్ధార్థ'. మీలాంటి యువకుడి కథ... అనేది క్యాప్షన్. శ్యామ్ సుందర్ రెడ్డి తుడితో కలిసి నందు నిర్మించారు. యామినీ భాస్కర్ కథానాయికగా నటించారు. జనవరి 1న థియేటర్లలో విడుదలైన చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Psych Siddhartha Story): పబ్బులో పరిచయమైన త్రిష (ప్రియాంక రెబెకా శ్రీనివాస్)తో సిద్ధార్థ్ (నందు) రిలేషన్‌షిప్‌లో పడతాడు. ఆమె కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మొదలు పెడతాడు. అయితే... సిద్ధార్థను త్రిషతో పాటు మన్సూర్ (సుఖేష్ రెడ్డి) మోసం చేస్తారు. వాళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో పడి సిద్ధార్థను కంపెనీ నుంచి బయటకు గెంటేస్తారు. రెండు కోట్లు లాస్ అయిన సిద్ధార్థ ఒక బస్తీలో చిన్న బిల్డింగులో అద్దెకు దిగుతాడు. అతడి కింద ఫ్లోరులో భర్త లైంగిక, శారీరక హింస భరించలేక అతణ్ణి విడిచి వచ్చిన శ్రావ్య (యామినీ భాస్కర్) అద్దెకు దిగుతుంది.
శ్రావ్య పరిచయంతో సిద్ధార్థలో ఎటువంటి మార్పు వచ్చింది? ఒకరి పరిచయం మరొకరి బాధను ఎలా దూరం చేసింది? గాయపడిన రెండు మనసులు కలిసి ఏం చేశాయి? సిద్ధార్థ వల్ల స్నేహితుడు రేవంత్ (సింహ ఎన్) ఎటువంటి ఇబ్బంది పడ్డాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Psych Siddhartha Movie Review In Telugu): గౌతమ బుద్ధునికి రావిచెట్టు కింద జ్ఞానోదయం అయ్యింది. 'సైక్ సిద్ధార్థ'లోని కథానాయకుడు (సిద్ధార్థునికి) ఓ అమ్మాయి వల్ల జ్ఞానోదయం అవుతుంది. అదెలాగో చెబితే కథలో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది కనుక చెప్పడం లేదు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే... చిన్న పిల్లలు స్కూల్ పుస్తకాల్లో ఉన్నది చదివి రావిచెట్టు కింద బుద్ధునికి జ్ఞానోదమైందని నమ్మొచ్చు. కానీ ప్రేక్షకులు ఒకట్రెండు సన్నివేశాల్లో నమ్మడం కష్టం. ముందు నుంచి మార్పు కనిపించాలి. కనిపించే మార్పు బలంగా, ప్రభావంతంగా ఉండాలి.
దర్శకుడిగా తొలి చిత్రానికి వరుణ్ రెడ్డి బలమైన క్యారెక్టరైజేషన్లు రాసుకున్నారు. ఓ మేకర్‌గా డిఫరెంట్ విజువలైజేషన్ ప్రేక్షకులకు ఇవ్వాలని ట్రై చేశారు. అయితే, కథకుడిగా - కథా రచయితగా బలమైన పాయింట్ రాసుకోలేదు. 'మైనస్ * మైనస్ = ప్లస్' అని లెక్కల్లో చదువుకున్నాం. 'కళ్ళు కళ్ళు ప్లస్, వాళ్ళు వీళ్ళూ మైనస్' అని సుకుమార్ '100% లవ్' సినిమాలోని పాటలో విన్నాం. కథకు అదే కీలకమైన ఎమోషన్ అయినప్పుడు తెరపై ఇంకెంత బలంగా చూపించాలి? అమ్మాయి మోసం చేసిన బ్రేకప్ బాధలో హీరో ఉంటాడు. భర్త హింసను భరించలేక అతడికి భయపడి దూరంగా హీరోయిన్ వచ్చేస్తుంది. ఆ ఇద్దరి జీవితాల్లో ప్రేమ పరంగా ఉన్నది మైనస్సే. ఆ రెండు మైనస్సులు కలిస్తే ప్లస్ అవుతుందని ప్రేక్షకుడికి ముందు నుంచి అర్థం అవుతుంది. అటువంటి అప్పుడు ఆ ఎమోషన్ బలంగా చూపించడం మానేసి సింపుల్‌గా 'దీంతో ప్రేమలో పడ్డారని ఫిక్స్ అవ్వండి' అని చెప్పడం బాలేదు.
క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని 'సైక్ సిద్ధార్థ' తీశారు. ఇటువంటి సినిమాలు వర్కవుట్ అవ్వాలంటే... ఆ క్యారెక్టర్‌తో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. సిద్ధార్థతో ఏ దశలోనూ కనెక్ట్ అవ్వలేం. బ్రేకప్ అయ్యిందని అతను బాధ పడుతుంటే 'అయ్యో' అని జాలి పడేలా లేదు. ఎట్ ద సేమ్ టైమ్... హీరోయిన్ యామినీ భాస్కర్ పాత్రను చూసి జాలి పడతాం. ఆవిడ క్యారెక్టర్ ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. మధ్యలో కొన్ని కామెడీ సీన్లు వర్కవుట్ అయ్యాయి. రెండు గంటల నిడివి ఉండటం ప్లస్ పాయింట్.
'సైక్ సిద్ధార్థ' ట్రైలర్ చూసి 'అర్జున్ రెడ్డి'లా ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ సినిమాతో దీన్ని పోల్చలేం. రెండిటి కథలు వేర్వేరు. ఇక హీరోల క్యారెక్టరైజేషన్లు కూడా వేర్వేరు. హిందీలో ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ 'ఢిల్లీ బెల్లీ' అని ఓ సినిమా చేశారు. రెగ్యులర్ మూవీ మేకింగ్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వకుండా కొత్తగా ఉంటుంది. కాస్త ఆ ఛాయలు కనిపిస్తాయి. జెన్ జి ఆడియన్స్ కోసం అన్నట్టు డిఫరెంట్ ఎడిటింగ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. స్క్రీన్ మీద టెక్స్ట్ రావడం ఒకటిరెండుసార్లు ఓకే. అది మరీ ఎక్కువ కావడం డిస్టర్బ్ చేసింది. స్మరన్ సాయి మ్యూజిక్ కొన్నిసార్లు రిలీఫ్ ఇచ్చింది. సాంగ్, ఆర్ఆర్ ఓకే. లిమిటెడ్ బడ్జెట్ వల్ల అనుకున్న స్థాయిలో సీన్లు తీయలేకపోయారని స్క్రీన్ మీద తెలుస్తుంది.
సిద్ధార్థ కోసం శ్రీ నందు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారు. ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. ఇంతకు ముందు సినిమాల్లో నందు గుర్తు రాకుండా, ఈ సినిమాలో క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా లుక్ నుంచి యాక్టింగ్ వరకు చాలా కేర్ తీసుకున్నారు. బ్రేకప్ & డబ్బులు పోయి పిచ్చి పట్టిన సైకో అంటే నమ్మేటట్టు ఆ లుక్ మైంటైన్ చేశారు. కథానాయికగా యామినీ భాస్కర్ నటన బావుంది. ఆమె నటన వల్ల కొన్ని సన్నివేశాల్లో భావం తెరపైకి వచ్చింది. హీరో స్నేహితుడిగా సింహ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. త్రిష పాత్రకు ప్రియాంక రెబెకా శ్రీనివాస్ యాప్ట్.
బూతులు, బోల్డ్ సీన్లు చూపిస్తే అది న్యూ ఏజ్ సినిమా అవ్వదు. ట్రైలర్లలో ఆ కంటెంట్ కొంత మందిని థియేటర్లకు రప్పిస్తుందంతే! ఒక్క విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాలి... హీరోయిన్‌గా పెళ్లి కాని అమ్మాయిని కాకుండా బిడ్డతో భర్త నుంచి వేరుపడిన మహిళతో హీరోతో ప్రేమలో పడినట్టు చూపించడం. ప్రేమ కోసం కష్టపడమని చివరిలో చెప్పిన మాటలు బావున్నాయి. అందరికీ నచ్చే సినిమా కాదిది. జెన్ జి (ఈ తరం యువత)కు అయినా సరే హీరో క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ ఒక్కటే సరిపోదు. కథ కావాలి. యామినీ భాస్కర్, నందు నటనకు పేరొస్తుంది. విజయం మాత్రం కష్టమే.





















