డబ్ల్యూపీఎల్ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
డబ్ల్యూపీఎల్ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయి కడప బిడ్డ శ్రీచరణికి జాక్‌పాట్ ధర దక్కింది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రీచరణిని తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.30 కోట్లకు తీసుకుంది. వన్డే ప్రపంచకప్ 2025లో సూపర్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన శ్రీచరణి కోసం ఢిల్లీ వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ మెగా వేలంలో ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రీచరణి కోసం యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరివరకు పోటీపడ్డాయి.
చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్ల రికార్డ్ ధరకు ఆెమను సొంతం చేసుకుంది. గత సీజన్‌లోనూ రూ. 50 లక్షల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కే ఆడింది శ్రీ చరణి. అయితే మొత్తం సీజన్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన శ్రీ చరణి.. 4 వికెట్లు తీసింది. ఇక వన్డే ప్రపంచకప్ 2025లో 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టి టీమిండియా ఛాంపియన్ కావడంలో కీ రోల్ పోషించడంతో ఆమెకు ఈ దఫా ఈ రేంజ్ రికార్డ్ ధర లభించింది. ఇదిలా ఉంటే.. టీమిండియా మరో ప్లేయర్, తెలంగాణ అమ్మాయి అరుంధతి రెడ్డికి కూడా మెగా వేలంలో మంచి ధర లభించింది.
ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.75 లక్షల రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అరుంధతి రెడ్డి గత 3 wpl సీజన్లలో రూ.30 లక్షల కనీస ధరతోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడింది. అయితే ఈ హైదరాబాద్ పేసర్ కోసం ఈ సారి మాత్రం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ముఖ్యంగా ఆమె ఓల్డ్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ఆర్‌సీబీ, గుజరాత్ జెయింట్స్ పోటీ పడ్డాయి. చివరకు ఆర్‌సీబీ రూ.75 లక్షల ధరకు సొంతం చేసుకుంది. ఇక డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడిన అరుంధతి రెడ్డి.. 17 వికెట్లు తీసింది. అయితే టీమిండియాలో కీ ప్లేయర్ అయినప్పటికీ.. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో ఒక్క మ్యాచ్ ఆడలేకపోయింది అరుంధతి. మరో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషను కనీస ధర రూ.10 లక్షలకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది.




















