Adani Speech Advantage Assam 2.0 | అడ్వాంటేజ్ అసోం 2.0 సమ్మిట్ లో అదానీ సంచలన ప్రకటన | ABP Desam
అడ్వాంటేజ్ అసోం 2.0 సమ్మిట్ లో అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీ సంచలన ప్రకటన చేశారు. ప్రధాని మోదీ హాజరైన ఈ సదస్సులో మాట్లాడిన గౌతమ్ అదానీ...అసోం ఉజ్వల భవిష్యత్తులో అదానీ గ్రూప్ భాగం అవుతుందని అందుకోసం 50వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటన చేశారు. అదానీ పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే "గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గౌరవనీయులైన అసోం గవర్నర్ కి, అసోం ముఖ్యమంత్రి హిమంతు బిశ్వ శర్మకు, ఇక్కడ ఉన్న అతిథులకు, అసోం సోదరసోదరీమణులకు నమస్కారం. అడ్వాంటేజ్ అసోం 2.0లో మీ అందరి ముందు నిలబడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కామాఖ్య మాత కొలువై ఉన్న ఈ పవిత్ర భూమికి వచ్చిన ప్రతీసారి నేను చెప్పేది ఒక్కటే..ఇక్కడి సహజ సిద్ధమైన వాతావరణ, ప్రకృతి అందాలు చూస్తే నా మనసు పులకరించిపోతుంది. పవిత్రమైన బ్రహ్మపుత్ర నదీ ఎలా అయితే ఈ అస్సాం నేలను తడుపుతూ ఓ అందమైన ఆకృతిని ఈ రాష్ట్రానికి కల్పించిందో..అలానే ప్రధాని నరేంద్ర మోదీ కూడా అసోంలో అందుబాటులో ఉండాల్సిన అవకాశాలను రీషేప్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ అనుభవం ఉన్న చేనేత కార్మికుడి లాంటి వారు. మన దేశమంతా ఓ అందమైన వస్త్రం అనుకుంటే మీరు సెవెన్ సిస్టర్స్ అని పిలుచుకునే అసోం సహా 7ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన దేశంతో మిళితం చేస్తూ భారత్ ను మరింత అందంగా తీర్చిదిద్దిన తొలి ప్రధాని . మీరు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, సౌకర్యాలను ఏర్పరిచి దేశంతో ఈ రాష్ట్రాలను అనుసంధానించిన విధానం కేవలం మీ ఇనీషియేటివ్స్ మాత్రమే కాదు ఈ ప్రాంత వాసుల నమ్మకాన్ని మరింత పెంచిన స్మారకాలుగా వాటిని చూడాలి. దేశాభివృద్ధిలో మీరు కేవలం అసోం ను దాని సిస్టర్ స్టేట్స్ ను మాత్రమే కలపలేదు తర్వాతి కాలంలో ఆ స్ఫూర్తితోనే ప్రగతి సాధించిన ఆ రాష్ట్రాలు ఇప్పుడు ఏకంగా దక్షిణా ఆసియా దేశాలతో వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నాయి.
నిన్న నేను ప్రధాని మోదీతో కలిసి భోపాల్ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఉన్నా. ఈ రోజు అడ్వాంటేజ్ అసోం సదస్సులో ఉన్నా. ఇలాంటి సదస్సులు జరుగుతున్నప్పుడు నాకు అనిపించేది ఒక్కటే. ఇదంతా కూడా 2003లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ తో మొదలయ్యాయి. అప్పటి మీ విజనే వైబ్రేంట్ గుజరాత్ సదస్సు నిర్వహణకు కారణం. అప్పుడు చిన్న నిప్పురవ్వలా మొదలైన ఈ పెట్టుబడుల సదస్సుల ప్రస్థానం ఇప్పుడు జాతీయ ఉద్యమంలా మారి ప్రతీ రాష్ట్రం పెట్టుబడుల ప్రోత్సాహకాల దిశగా సాగి ఆర్థిక పురోగతి సాధించటానికి కారణమైంది. రెండు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ పెట్టుబడుల సదస్సులు ఇప్పుడు నాటి మీ లక్ష్యాలను మించిన స్థాయిలో జరుగుతున్నాయి. ఇలా వస్తున్న బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇప్పుడు మీ వికసిత్ భారత్ లక్ష్యానికి కారణమవుతున్నాయి.
నేను ఎప్పుడు ప్రధాని మోదీని కలిసినా స్ఫూర్తి పొందుతుంటాను. మొదటిసారి ముఖ్యమంత్రిగా చేసిన అప్పటి ఓ నాయకుడు నాడు ఇలా ఎలా ఓ ఆశను, స్ఫూర్తిని ప్రజల్లో, పెట్టుబడిదారుల్లో రగిల్చి ఈ రోజు దేశం అభివృద్ధి పథంలో నడవటానికి కారణమయ్యారోనని ఆశ్చర్యపోతుంటాను. డ్రగ్స్ వినియోగం, బాల్య వివాహాలు లాంటి సామాజిక అవలక్షణాలపై మీరు చేస్తున్న పోరాటం ఓ క్యాంపెయిన్ మాత్రమే కాదు అదొక మిషన్ లా నడిపిస్తున్నారు. దేశంలో మౌలిక వసతులు పెంచితే ప్రగతి అదే వస్తుందనే మీ ఆలోచన స్ఫూర్తి దాయకం. అలాంటి ఆలోచనలే బ్రహ్మపుత్రను ఆధారం చేసుకుని నేడు భారత్ లో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీకి అసోం లాంటి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చాయి. అసోం ఉజ్వల భవిష్యత్తుకు అదే మార్గనిర్దేశం చేస్తున్నాయి. అందుకే మేం కూడా ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం. అందుకే సగర్వంగా ప్రకటిస్తున్నాం. 50వేల కోట్ల రూపాయలను అసోంలో పెట్టుబడిగా పెట్టాలని అదానీ గ్రూప్ తరపున నిర్ణయం తీసుకున్నాం. ఈ 50వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఎయిర్ పోర్టులు, ఏరో సిటీల నిర్మాణం, గ్యాస్ సరఫరా, ట్రాన్స్మిషన్స్, సిమెంట్, రోడ్ల నిర్మాణంపై ఖర్చు పెడతాం. అసోం గొప్ప మార్గంలో ప్రయాణిస్తోంది. ఆ దారిలో అసోం తో కలిసి నడిచేందుకు అదానీ గ్రూప్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీకి, సీఎం హిమంతు బిశ్వ శర్మకు మాటిస్తున్నాం. అసోం భవిష్యత్తును బలంగా నిర్మిద్దాం. ఇదే మా విజన్, మా దూరదృష్టి, మా కమిట్మెంట్." అన్నారు గౌతమ్ అదానీ.





















