Kadapa Karam Dosa Recipe : కడప కారం దోశ.. బెస్ట్ చట్నీకాంబినేషన్.. టేస్టీ రెసిలు ఇవే
Ghee Karam Dosa : కడప కారం దోశ తినాలంటే రాసి పెట్టి ఉండాలని చెప్పవచ్చు. ఇది అంత రుచిగా మీ మనసును దోచేస్తుంది. పర్ఫెక్ట్ చట్నీ కూడా ఉంటే అదుర్స్ అనేయాలి అంతే.. ఇంతకీ ఎలా చేయాలంటే..

Kadapa Style Ghee Kaaram Dosa Recipe : దోశల్లో ఎన్ని వెరైటీలు తిన్నా.. కడప కారం దోశకి ఉండే ఫ్యాన్ బేస్ వేరు. ఇప్పటివరకు దానిని తినని వారు కూడా ఒక్కసారి దానిని తింటే అది మీ ఫేవరెట్ లిస్ట్‌లోకి వెళ్లిపోతుంది. పైగా దీనికి బెస్ట్ చట్నీ కాంబినేషన్ ఉంటే తిన్న ఆ నోటికి అదృష్టమనే చెప్పొచ్చు. ఇంతకీ ఈ కడప కారం దోశను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? చట్నీని టేస్టీగా ఎలా చేయవచ్చు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మినపప్పు - 1 కప్పు
బియ్యం - మూడు కప్పులు
మెంతులు - 1 టీస్పూన్
నీళ్లు - పిండికి సరిపడేంత
ఉప్పు - రుచికి తగినంత
ఎర్రకారానికై..
ఎండుమిర్చి - 25
ఉప్పు - రుచికి తగినంత
జీలకర్ర - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 2
నీళ్లు - ఎర్రకారానికి సరిపడేంత
వెల్లుల్లి - 6 రెబ్బలు
వేయించిన శనగపప్పు- అరకప్పు
పచ్చడికై
చింతపండు - నిమ్మపండు సైజ్ అంత
శనగ పిండి - 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - పావు టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు- అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
నూనె - రెండు టీస్పూన్లు
అల్లం - అర టీస్పూన్
పచ్చిమిర్చి ముక్కలు - 1 టీస్పూన్
కరివేపాకు - రెండు రెబ్బలు
తయారీ విధానం
మినపప్పు, బియ్యం, మెంతులను వేరుగా నానబెట్టుకోవాలి. ఓ నాలుగు లేదా ఐదు గంటలు ఇవి నానితే సరిపోతుంది. వీటిని రాత్రుళ్లు గ్రైండ్ చేసి పెట్టుకుంటే.. ఉదయాన్నే దోశ వేసుకునేందుకు పిండి పులుస్తుంది. దీనివల్ల దోశలు బాగా వస్తాయి. మినపప్పుతో చేసుకునే ఏ దోశకైనా పిండి పులిస్తే రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దోశ వేసుకునే ముందు పిండిలో ఉప్పు, నీరు దోశ వేసుకునేందుకు సరిపోతాయో లేదో చెక్ చేసుకుని.. కలుపుకోవాలి.
దోశలు వేసుకోవడానికి ఓ పావు గంట ముందు ఎండు మిర్చిని నానబెట్టుకోవాలి. అనంతరం వాటిని ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటిలోనే జీలకర్ర, ఉల్లిపాయలను వేసి స్మూత్ పేస్ట్ వచ్చేలా పేస్ట్ చేసుకోవాలి. వేయించిన శనగపప్పు, వెల్లుల్లిని కలిపి మంచి పౌడర్‌గా చేసుకోవాలి. ఈ రెండు దోశపై వేసుకునేందుకు ఉపయోగపడతాయి. బొంబాయి చట్నీ కోసంఓ గిన్నెలో శనగపిండి, ఉప్పు, నీళ్లు, చింతపండు గుజ్జు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండి ఉండలు లేకుండా చేతితో కలుపుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టండి. దానిలో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము, పసుపు వేసి తాళింపు వేసుకోవాలి. ఇవి మంచిగా వేగితే.. ముందుగా తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని దీనిలో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్లు ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే కారం దోశకి పర్ఫెక్ట్ అనిపించే బొంబాయి చట్నీ రెడీ. దీనిని మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు.
స్టౌవ్ వెలిగించి దానిపై దోశ పాన్ పెట్టుకోవాలి. దానిపై దోశను వేసుకోవాలి. నూనె అంచుల వెంబడి వేసుకుని.. దానిపై నెయ్యి అప్లై చేయాలి. దోశను రోస్ట్ చేసుకుంటూ.. అది కాస్త వేగిన తర్వాత దానిపై ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్‌ను ఓ స్పూన్ వేసి దోశపై అప్లై చేసుకోవాలి. అనంతరం వేయించిన శనగపప్పు పిండిని చల్లుకోవాలి. కాస్త మగ్గితే కడప నెయ్యి కారం దోశ రెడీ. దీనిని మీరు బొంబాయి చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే ఇది మీ ఫేవరెట్ దోశ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ దోశను ట్రై చేసేయండి.
Also Read : నోరూరించే మినపప్పు ఫ్రైడ్ రైస్.. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోగలిగే రెసిపీ ఇదే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

