Minapappu Fried Rice Recipe : నోరూరించే మినపప్పు ఫ్రైడ్ రైస్.. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోగలిగే రెసిపీ ఇదే
Minapappu Annam : రోజూ రోటీన్ రైస్ తిని బోర్ కొట్టిందా? అయితే మీ రైస్ రుచిని మరింత పెంచే మినపప్పు అన్నం చేసుకుని తినేయండి. ఇది మీకు మంచి రుచిని పక్కాగా అందిస్తుంది. దీనిని ఎలా చేయాలంటే..
Lunch Box Special Minapappu Fried Rice : మినపప్పుతో టిఫిన్లు చేసుకుంటారు. దానిని నానబెట్టడం పిండి చేయడం అంతా ఓ పెద్ద ప్రాసెస్. కానీ ఎక్కువ శ్రమ లేకుండా.. టేస్టీగా ఉండే మినపప్పు రైస్‌ని ఎప్పుడైనా తిన్నారా? మినపప్పు రైసా? అని అనుకోకండి. దీనిని ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ చేసుకుని తినగలిగే రెసిపీ ఇది. పైగా దీనిని చేయడం కూడా చాలా తేలిక. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తినే లంచ్ బాక్స్ రెసిపీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
ఎండు మిర్చి - 12
ధనియాలు - రెండు టేబుల్ స్పూన్లు
మినపప్పు - పావు కప్పు
కొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు
చింతపండు - చిన్న ఉండ (గోలి అంత సరిపోతుంది)
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
ఎండు మిర్చి - 2
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 2
ఉప్పు - రుచికి తగినంత
ఇంగువ - చిటికెడు
అన్నం - ఒకటిన్నర కప్పులు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోండి. దానిలో నెయ్యి వేసి కరగనివ్వాలి. అనంతరం దానిలో ధనియాలు వేయాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో ఎండుమిర్చి వేయాలి. ఎండు మిర్చి, ధనియాలు వేగిన తర్వాత దానిలో మినప్పపు వేసుకోవాలి. పొట్టు మినపప్పు వేసుకుంటే రుచి నెక్స్ట్ లెవల్ ఉంటుంది. ఒకవేళ మీకు అది అందుబాటులో లేకున్నా మినప గుళ్లు వేసుకుని ఈ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవచ్చు.
స్టౌవ్ మంట తగ్గించి.. సన్నని మంట మీద మినపప్పును వేయించుకోవాలి. మినపప్పు వేగితే దానినుంచి మంచి సువాసన వస్తుంది. దానిలో పచ్చికొబ్బరి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాజా కొబ్బరి అయితే రుచి బాగుంటుంది. డ్రై కొబ్బరి అయితే దీనిలో సగం వేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు వేగేలా ఓ నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి కాస్త చల్లారనివ్వాలి.
మిక్సీ జార్ తీసుకుని దానిలో చింత పండు వేయాలి. దానిలో వేయించుకున్న మినపప్పు మిశ్రమాన్ని వేసి మిక్సీ చేసుకోవాలి. అయితే పూర్తిగా పొడిగా కాకుండా బరకగా ఉండేలా చేసుకోవాలి. అప్పుడే తింటున్నప్పుడు నోటికి క్రంచీగా, టేస్టీగా ఉంటుంది. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టి.. స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచండి. దానిలో కాస్త నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
ఎండుమిర్చి కాస్త డార్క్ అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు, ఇంగువ, ఉప్పు వేసి మరోసారి కలపాలి. వేగిన తాళింపులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పొడిని వేసి కలపాలి. పది సెకన్లు వేయించుకున్న తర్వాత దానిలో ఒకటిన్నర కప్పుల రైస్ వేసి పూర్తిగా కలిసేలా బాగా కలపాలి. అన్నం పొడిగానే ఉండాలి. అప్పుడే ఈ మినపప్పు ఫ్రైడ్ రైస్ తినడానికి బాగుంటుంది. చివర్లో కాస్త నెయ్యి వేసి మరోసారి కలిపి దించేస్తే మినపప్పు ఫ్రైడ్ రైస్ రెడీ.
Also Read : టేస్టీ, స్పైసీ మినపప్పు పచ్చడి.. నెల్లూరు స్టైల్లో ఇలా చేసేయండి