Minapappu Pachadi Recipe : టేస్టీ, స్పైసీ మినపప్పు పచ్చడి.. నెల్లూరు స్టైల్లో ఇలా చేసేయండి
Minapappu Pachadi Recipe : నెల్లూరు ఫుడ్ అంటే ఇష్టమా? అయితే మీకు ఈ మినపప్పు పచ్చడి గురించి తెలిసే ఉంటుంది. దీనిని టేస్టీగా ఎలా చేసేయాలో ఇప్పుడు చూసేద్దాం.
Tasty and Spicy Minapapappu Pachadi Recipe : సాధారణంగా మినపప్పును ఇడ్లీ, దోశ, వడ వంటి వంటకాలు చేసుకుంటాము. లేదంటే సున్నుండలు, లేదా తాలింపు కోసం ఉపయోగిస్తాము. కానీ మినపప్పుతో టేస్టీ, స్పైసీ పచ్చడి చేసుకోవచ్చని తెలుసా? ఒక్కసారి దీనిని చేసుకుని తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచిని ఇది మీకు ఇస్తుంది. దీనిని రైస్, టిఫిన్స్, రోటీలలో కూడా కలిపి తీసుకోవచ్చు. మరి ఈ టేస్టీ, స్పైసీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మినపప్పు - పావు కప్పు
ఎండుమిర్చి - 25
ధనియాలు - 2 స్పూన్స్
జీలకర్ర - 1 స్పూన్
చింతపండు - నిమ్మకాయ సైజ్‌లో తీసుకోవాలి.
ఉప్పు - రుచికి తగినంత
బెల్లం - ఓ అంగుళం ముక్క
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
ఇంగువ - చిటికెడు
వెల్లుల్లి - 8 రెబ్బలు
ఉల్లిపాయ - 1
కరివేపాకు - 2 రెబ్బలు
నూనె - తగినంత
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకోండి. ఇప్పుడు దానిలో రెండు టీస్పూన్ల నూనె వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. అవి మంచిగా వేగిన తర్వాత వాటిని ఓ గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో స్పూన్ నూనె వేయాలి. దానిలో మినపప్పు వేసి వేయించుకోవాలి.
సాధారణంగా పట్టు ఉన్న మినపప్పుతో ఇది చేసుకుంటే అద్భుతమైన రుచి వస్తుంది. మీ దగ్గర పొట్టులేని మినపప్పు ఉన్నా.. దానితో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. అయితే రెండూ ఉంటే మాత్రం పొట్టు ఉన్న మినపప్పుతోనే చేసుకోండి. ఇలా నూనెలో వేసి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండును వంటను ప్రారంభించే ముందే నానబెట్టుకోవాలి.
ఇప్పుడు వేయించుకున్న పదార్థాలను మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. దానిలో కాస్త ఉప్పు కూడా వేసి ఓ సారి మిక్సీ చేసుకోవాలి. అనంతరం దానిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. అలాగే బెల్లం ముక్కను కూడా వేయాలి. ఇది వేయడం వల్ల ఎండుమిర్చిలోని కారం, చింతపండులోని పులుపు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు బెల్లం కూడా వేసి మరోసారి మిక్సీ చేయాలి. అయితే మినపప్పు మరీ పేస్ట్‌గా కాకుండా కాస్త బరకగానే ఉంచుకోవాలి. అవసరం మేరకు నీరు కలుపుకోవాలి. కుదిరితే వేడినీళ్లు వాడుకోవచ్చు.
ఇప్పుడు మరోసారి స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టాలి. దానిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు వేసి తాళింపు పెట్టుకోవాలి. అందులో కాస్త బరకగా మిక్స్ చేసుకున్న పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి. తాళింపు బాగా మిక్స్ అయిన తర్వాత దానిలో కాస్త పెద్దగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. అంతే టేస్టీ, స్పైసీ మినపప్పు పచ్చడి రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా అనేస్తారు. అంతేకాకుండా దీనిని ఇడ్లీ, దోశలు వంటి టిఫెన్లలో కూడా తీసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని తయారు చేసి రుచి చూసేయండి. ఉల్లిపాయలు వేయకుండా దీనిని దాదాపు పదిరోజులు స్టోర్ చేసుకోవచ్చు.
Also Read : లంచ్ బాక్స్ స్పెషల్ టేస్టీ దాల్ పులావ్.. చాలా సులభంగా ఇంట్లో చేసేసుకోండిలా