Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyderabad News: అల్లు అర్జున్ వ్యాఖ్యలు సీఎం రేవంత్‌ను కించపరిచేలా ఉన్నాయని.. వెంటనే బన్నీ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిని ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister Komatireddy Venkatreddy Sensational Comments On Allu Arjun: తెలంగాణలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన సంచలనం రేకెత్తించగా.. శనివారం అసెంబ్లీలో అల్లు అర్జున్‌పై (Allu Arjun) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy).. అల్లు అర్జున్, సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఐకాన్ స్టార్ ప్రెస్ మీట్‌పై ఆయన స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి బన్నీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడడం సరికాదన్నారు.
'మానవత్వం లేకుండా ఉంటారా.?'
'ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదని అల్లు అర్జున్ అనడం హస్యాస్పదం. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారు. ఇది పద్ధతి కాదు. అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా థియేటర్‌కు వెళ్లాడు. మా వద్ద అన్ని ఆధారాలున్నాయి. బన్నీ కామెంట్స్ సీఎంను అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకోవాలి.' అని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్‌ను చిరంజీవి ఎందుకు పరామర్శించట్లేదని ఆయన ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు మొత్తం ఇలాగే మానవత్వం లేకుండా ఉంటారా.? అంటూ నిలదీశారు. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు ఉండవంటూ స్పష్టం చేశారు. అటు, శనివారం తెలంగాణ అసెంబ్లీ ముగిసిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు. బాలుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం రేవతి కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అటు, రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
మరోవైపు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అల్లు అర్జున్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలను తప్పుపట్టేలా బన్నీ వ్యవహరిస్తున్నారని.. ఆయన తీరు దారుణంగా ఉందని అన్నారు. 'అల్లు అర్జున్‌లో కనీసం పశ్చాత్తాపం కనిపించట్లేదు. రేవతి కుటుంబంపై సానుభూతి చూపించలేదు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తెచ్చిన ప్రస్తావనపైనే సీఎం స్పందించారు. పోలీసులు చెప్పినా వినకుండా అల్లు అర్జున్ థియేటర్‌లో షో చేశారు. ప్రాణాల కంటే పేరు ప్రతిష్టలు ఎక్కువా.?' అంటూ నిలదీశారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలివే.!
కాగా, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ రావడమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. దీనికి అసెంబ్లీలో సీఎం సమాధానమిచ్చారు. ఓ హీరో తన సినిమా చూసేందుకు థియేటర్‌కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు చావుబతుకుల మధ్య ఉన్నాడని.. ఆ సమయంలోనూ నటుడు వాహనం రూఫ్ టాప్ నుంచి ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, బాధ్యులైన థియేటర్ యాజమాన్యంతో పాటు హీరోపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ఈ వ్యాఖ్యలను బన్నీ తప్పుపట్టారు.