ఉదయం నిద్ర నుంచి లేచాక కూడా అలసటగా అనిపిస్తోందా? అయితే ఇవే కారణాలు
కొందరికి 24 గంటలూ అలసటగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. నిజానికి అది చాలా సమస్యలకు సంకేతంగా భావించాలి.
రాత్రంతా తొమ్మిది, పది గంటలు నిద్రపోయి మార్నింగ్ ఫ్రెష్ గా లేచాక మీకు ఎలా అనిపిస్తుంది? ఎనర్జిటిక్ అనిపిస్తుందా,ప్రశాంతంగా అనిపిస్తుందా... అయితే మీ ఆరోగ్యం బావున్నట్టే. కానీ కొందరిలో నిద్రపోయి లేచాక కూడా అలసటా,నీరసంగా, నిస్తేజంగా అనిపిస్తే మాత్రం ఆరోగ్యపరంగా ఏదో తేడా ఉన్నట్టే. కొన్ని రోజులకు ఇది సాధారణంగా మారితే ఫర్వలేదు నెల రోజులు దాటి ఇలాగే అనిపిస్తే మాత్రం కొన్ని అంశాలను తెలుసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని కూడా కలవచ్చు.
పనిలేకుండా...
రోజు వారీ పనులు పెద్దగా ఏమీ చేయకుండా బద్దకంగా జీవితం గడిపేవారికి ఉదయం లేవగానే కూడా అలా నిస్తేజంగానే అనిపిస్తుంది. ఏ పనీపాటు చేయకపోవడం వల్ల మీ శరీరం తక్కువ శక్తి స్థాయిలకు అలవాటు పడిపోయి, చిన్న విషయాలకే అలసిపోతుంది. శరీరం శక్తిని పెంచాలంటే ఎక్కువ కాలం ఖాళీగా కూర్చోకూడదు, రోజూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి.తమ పనులు తాము చేసుకుంటూ, ఇంట్లో పనులు, బయటి పనులు చేస్తూ ఉంటే శరీరం చురుగ్గా పనిచేస్తుంది.
మానసిక సమస్యలు
ఆందోళనగా అనిపించడం,నిరాశ వంటివి మానసిక సమస్యల కిందకే వస్తాయి. మీరు త్వరగా అలసిపోవడానికి ఇవి కూడా కారణాలు కావచ్చు. మేల్కొన్న తరువాత అలసట ఫీలింగ్ వీటి వల్ల వస్తుంది. ఈ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని త్వరగా అలసిపోయేలా చేస్తాయి. అలాగే వీటి కోసం మీరు ఏమైనా మందులు వాడుతుంటే వాటి ప్రభావం కూడా మీ నిద్రపై,చురుకుదనం పై ప్రభావం చూపిస్తాయి.
డీహైడ్రేషన్
నిద్రపోయి లేచాక ఎవరికైనా ఉత్సాహంగా ఉండాలి. కానీ అలసటగా ఉందంటే శరీరంలో ఏదో తక్కువైనట్టు అర్థం. శరీరానికి సరిపడినంత నీరు అందకపోయినా కూడా అలసట, నిరుత్సాహం పెరిగిపోతుంది. నిద్రపోయి లేచాక కూడా మీకు అలసటగా అనిపిస్తుంది.
నిద్రరుగ్మతలు
నిద్ర లేచిన తరువాత మీకు ఇంకా నిద్రపోవాలని, అలసటగా అనిపిస్తే ... ఆ పరిస్థితికి నిద్ర రుగ్మతలు కూడా కారణం కావచ్చు. మీరు నిద్ర రుగ్మతలతో బాధపడుతున్నప్పుడు అర్థరాత్రి మెలకువ వచ్చేస్తుంది. త్వరగా నిద్రపట్టదు. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. దీని వల్ల మీరు ఉదయం అలసిపోయినట్టు కనిపిస్తారు.
Also read: చిన్నికృష్ణయ్యకు తియ్యటి నైవేద్యాలు, వీటిని పావుగంటలో చేసేయచ్చు
Also read: సహోద్యోగులు తన పెళ్లికి పిలిస్తే రాలేదని ఆ పెళ్లి కూతురు ఏం చేసిందంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.