Digital Rape: ఐసీయూలో పేషెంట్‌పై డిజిటల్ రేప్ కేసులో నిందితుడు అరెస్ట్.. ఇంతకీ డిజిటల్ రేప్ అంటే ఏంటీ ?
గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ లోని ఐసీయూలో మహిళా పేషెంట్‌పై ఇటీవల డిజిటల్ రేప్ చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ డిజిటల్ రేప్ అంటే ఏంటీ ? వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Digital Rape At Medanta Hospital ICU | గురుగ్రామ్ ఆడవారిపై లైంగిక వేధింపులు, దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వీలు చిక్కిందంటే చాలు మహిళలపై ఏదో చోట అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు కీచకులు. ఈ క్రమంలో గురుగ్రామ్‌లో జరిగిన డిజిటల్ రేప్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గురుగ్రామ్‌లోని ఆస్పత్రిలో చేరిన ఓ మహిళా ఉద్యోగినిపై డిజిటల్ రేపు జరిగినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
ఫ్లైట్ అటెండెంట్ ఏప్రిల్ మొదటి వారంలో గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న టెక్నీషియన్ చికిత్స కోసం వచ్చిన మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 6న మేదాంత ఆసుపత్రిలోని ఐసియు లోపల చికిత్స పొందుతున్న 46 ఏళ్ల పేషెంట్‌పై హాస్పిటల్ సిబ్బంది 'డిజిటల్ రేప్'నకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పిటిఐ నివేదించిన వివరాల ప్రకారం, మహిళా పేషెంట్ పై జరిగిన డిజిటల్ రేప్ వేధింపుల కేసులో పోలీసులు వైద్యులు సహా ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సిసిటివి కెమెరాల ఫుటేజీలను సైతం పరిశీలించిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. హాస్పిటల్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఫ్లైట్‌లో సేవలు అందించే మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చర్యలు తీసుకున్నారు. గురుగ్రామ్ పోలీసులు శనివారం బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల దీపక్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడి మొబైల్ హిస్టరీని పోలీసులు చెక్ చేశారు. అతడి మనస్త్వంపై సైతం ఓ అంచనా వచ్చారు. విచారణలో నిందితుడు తన తప్పును అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితుడు దీపక్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు గత ఐదు నెలలుగా మేదాంత ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.
డిజిటల్ రేప్ అంటే ఏమిటి..
డిజిటల్ రేప్ అనేది సాంకేతిక పదమో, ఆన్ లైన్ ద్వారా వేధించడం కూడా కాదు. ఈ పదాన్ని వినగానే చాలామంది ఆన్‌లైన్ లో వేధింపులకు పాల్పడ్డారని భావిస్తుంటారు. దేశంలో సంచలనం రేపిన నిర్భయ ఘటన తర్వాత ఈ చట్టంలో మార్పులు చేర్పులు చేశారు. డిజిటల్ రేప్ అంటే మర్మాంగం కాకుండా ఏదేని ఇతర వస్తువులు, చేతి వేళ్లను ఉపయోగించి అసహజరీతిలో లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు చేయడం. బాధితులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి అశ్లీల వీడియోలు చూపించడం, కొన్ని రకాల సిగ్నల్స్ చేస్తూ మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడటం లాంటివి ఈ కేటగరిలోకి వస్తాయని అధికారులు తెలిపారు. నిందితులకు ఐదేళ్లు, గరిష్టంగా పదేళ్లు జైలుశిక్ష.. ఒక్కోసారి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.
గతంలోనూ డిజిటల్ రేప్ కేసులు నమోదు
2022లో డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వృద్ధుడిని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. పెయింటింగ్ ఆర్టిస్ట్, టీచర్ అయిన నిందితుడికి హిమాచల్ ప్రదేశ్ లోనూ ఓ ఆఫీస్ కూడా ఉంది. అతని దగ్గర పనిచేసే వ్యక్తి చదువు చెప్పాలని కోరుతూ తన కుమార్తెను వృద్ధుడి వద్దకు పంపారు. కానీ ఆ కామాంధుడు పాఠాలు చెప్పడానికి బదులు తన వికృతాన్ని బయట పెట్టాడు. దాదాపు కొన్నేళ్ల పాటు యువతిపై డిజిటల్ రేప్ చేశాడు. వృద్ధుడు చేసే వికృత చేష్టలకు భయపడిన ఆ అమ్మాయి మొదట ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని ఆడియో ఫైల్స్, ఇతర ఆధారాలను కలెక్ట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులు నిజమేనని గుర్తించిన పోలీసులు డిజిటల్ రేప్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు.






















