Children Day Special: పిల్లల బ్యాంక్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి ? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?
Children Bank Account: చిన్నారులకు పొదుపు ప్రాధాన్యత తెలియజేసి ఆర్థిక క్రమశిక్షణ నేర్పేందుకు ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

Children Bank Account: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పిల్లల బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ద్వారా పిల్లలు చిన్న వయసు నుంచే పొదుపు, ఆర్థిక ప్రణాళిక అలవాటు పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఏ వయసున్న పిల్లైనా తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ సహాయంతో పొదుపు లేదా టర్మ్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేయవచ్చు. తల్లిని కూడా గార్డియన్‌గా గుర్తించారు.
కొత్త మార్గదర్శకాలు ఏమిటి
పిల్లవాడు 10 సంవత్సరాలు లేదా అంతకంటే పెద్దవాడైతే, తన ఇష్టం ప్రకారం పొదుపు లేదా టర్మ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. దాన్ని నిర్వహించవచ్చు. కానీ దీనికి బ్యాంకు తన రిస్క్ మేనేజ్‌మెంట్ పాలసీ ప్రకారం కొన్ని షరతులు, పరిమితులను నిర్ణయిస్తుంది. వాటిని ఆ పిల్లవాడికి స్పష్టంగా వివరించడం అవసరం.
పిల్లవాడు 18 సంవత్సరాలు నిండిన వెంటనే, బ్యాంకు అతని నుంచి కొత్త ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్, సంతకం (సిగ్నేచర్) తీసుకోవాలి. ఖాతాను తల్లిదండ్రులు లేదా గార్డియన్ నిర్వహిస్తున్నట్లయితే, బ్యాంకు బ్యాలెన్స్ నిర్ధారణ చేస్తుంది. దీనికి బ్యాంకులు ముందుగానే సంబంధిత సమాచారాన్ని పిల్లలకు , వారి తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచుతాయి. తద్వారా ఈ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.
పిల్లలకు లభించే సౌకర్యాలు
అదనంగా, బ్యాంకులు పిల్లలకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM/డెబిట్ కార్డు, చెక్ బుక్ వంటి సౌకర్యాలను అందించవచ్చు. అది బ్యాంకు పాలసీ, కస్టమర్ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఉంటే అలా చేస్తారు. అయితే పిల్లల ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఉండదు. ఖాతాలో ఎల్లప్పుడూ పాజిటివ్ బ్యాలెన్స్ ఉండటం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
చిన్నారులకు పొదుపు ప్రాధాన్యత తెలియజేసి ఆర్థిక క్రమశిక్షణ నేర్పేందుకు ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.





















