Prakash Raj: అమాయకులపై దాడి కాదు.. కశ్మీర్‌పై దాడి - పహల్గాం ఉగ్ర దాడిపై ప్రకాష్ రాజ్ సుదీర్ఘ పోస్ట్
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్ర దాడిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని.. కశ్మీర్‌పై జరిగిన దాడి అని అన్నారు. 'ఎక్స్' వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

Prakash Raj Reacts On Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడిని ప్రకాష్ రాజ్ (Prakash Raj) తీవ్రంగా ఖండించారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని.. కశ్మీర్‌పై జరిగిన దాడి అని అన్నారు. ఈ ఘటనతో ప్రతీ కశ్మీరీ గుండె ముక్కలైందని అన్నారు.
గుండెల్లో అంతులేని బాధతో..
ఈ మారణకాండపై మాటలు రావడం లేదని.. గుండెల్లో అంతులేని బాధతో ఇది రాస్తున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ క్రమంలో 'ఎక్స్' వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. 'ఏప్రిల్ 22, 2025 పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్ధం ఆవరించిన రోజు. ప్రశాంత ప్రకృతి వాతావరణంలో అలరారుతున్న ప్రదేశంలో నెత్తురు చిందిన రోజు. ప్రతీ కశ్మీరీ గుండె పగిలింది. క్రూరమైన ఈ చర్యను చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. అందుకే బరువైన హృదయంతో ఇది రాస్తున్నా. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంగా కాల్చి చంపారు. ప్రశాంత వాతావరణం ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితిని ఎదుర్కొన్నారు. ఈ ఆటవిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు. కశ్మీర్‌పై దాడి.' అని అన్నారు.
మా రక్తం మరిగిపోతోంది
ఈ దాడి శతాబ్ధాల సంప్రదాయాలకు జరిగిన అవమానంగా ప్రకాష్ రాజ్ అభివర్ణించారు. 'మన విశ్వాసాన్ని దెబ్బ తీసేలా దుష్ట ప్రయోజనాల కోసం చేసిన దారుణం. ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది. ఇలాంటివి జరిగిన ప్రతిసారీ మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు చేయని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తోంది. ఇది నిజంగా భయంకరమైన చర్య. అంతకుమించి పిరికిపంద చర్య.
ఇలాంటి సమయంలో కశ్మీరులు మౌనంగా ఉండకూడదు. మన ఇంటిలో జరిగిన ఈ క్రూర చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. మీరు (ఉగ్రవాదులు) ఏం ఆశించి ఇలాంటి దారుణ హింసకు పాల్పడ్డారో తెలియదు. మీ దుశ్చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసింది. ఎంతోమంది పిల్లలను అనాథలుగా మార్చింది.' అని పేర్కొన్నారు.
Listen to this Voice from Kashmir . 🙏🏿🙏🏿🙏🏿💔💔💔 #PahalgamTerrorAttack pic.twitter.com/CJGsXcy3O1
— Prakash Raj (@prakashraaj) April 24, 2025
'క్షమించమని అడుగుతున్నా'
కశ్మీర్ ఆట స్థలం కాదని.. యుద్ధ క్షేత్రం అంతకన్నా కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. 'ఇదేమీ మీరు ఉపయోగించుకునే ఆయుధమూ కాదు. అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశం. ఈ ఘటనలో బాధిత కుటుంబాలు అనుభవించే బాధ వారి ఒక్కరిదే కాదు. మా అందరిదీ. మీతో మేమూ దుంఖిస్తున్నాం. మీరు కోల్పోయిన దానికి చింతిస్తున్నాం. మీరు కశ్మీర్‌లో ప్రశాంతంగా ఉండడానికి వచ్చారు. కానీ మేము దానిని కాపాడలేకపోయాం. అందుకు క్షమించమని అడుగుతున్నాం.' అని పోస్ట్ చేశారు.





















