TG Inter Board: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల, ఫీజు వివరాలు ఇలా
INTER SUPPLY EXAMS: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు వెల్లడించింది. మే 22 నుంచి 29 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

TG INTER SUPPLY EXAMS: తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లి్మెంటరీ పరీక్షలతోపాటు, మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల షెడ్యూలు ఇంటర్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులకు మే 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ/ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం సెషన్‌లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ ఇంటర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇదే టైం టేబుల్ వర్తిస్తుందని ఆయన తెలిపారు.
జూన్ 3 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు..
ఇంటర్ విద్యార్థులకు జూన్ 3 నుంచి 6 వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 9న ప్రథమ సంవత్సరం, 10న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
సప్లిమెంటరీ ఫీజు గడువు ఏప్రిల్ 30 వరకు..
ఇంటర్ ఫలితాలకు సంబంధించి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లి్మెంటరీ పరీక్షలతోపాటు, మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల కోసం ఫీజు చెల్లింపు ప్రక్రియ ఏప్రిల్ 23న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.520 తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాయాలనుకునేవారు మాత్రం పరీక్ష ఫీజుకు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు అదనంగా రూ.180 ఫీజు చెల్లించాలి.

ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ మే 22 (గురువారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1.
➥ మే 23 (శుక్రవారం): ఇంగ్లిష్ పేపర్-1.
➥ మే 24 (శనిళవారం): మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1.
➥ మే 25 (ఆదివారం): మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1.
➥ మే 26 (సోమవారం): ఫిజిక్స్ పేపర్-1, ఎకానమిక్స్ పేపర్-1.
➥ మే 27 (మంగళవారం): కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1.
➥ మే 28 (బుధవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).
➥ మే 29 (గురువారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..
➥ మే 22 (గురువారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2.
➥ మే 23 (శుక్రవారం): ఇంగ్లిష్ పేపర్-2.
➥ మే 24 (శనిళవారం): మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2.
➥ మే 25 (ఆదివారం): మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
➥ మే 26 (సోమవారం): ఫిజిక్స్ పేపర్-2, ఎకానమిక్స్ పేపర్-2.
➥ మే 27 (మంగళవారం): కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2.
➥ మే 28 (బుధవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2(బైపీసీ విద్యార్థులకు).
➥ మే 29 (గురువారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2.
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు..
మరోవైపు, ఏపీలో మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ఇటీవల ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జూన్ 4న, పర్యావరణ విద్య జూన్ 6న నిర్వహించనున్నట్లు అధికారులు ఇది వరకే తెలిపారు.





















