Eye Conjunctivitis: పెరిగిపోతున్న కండ్ల కలక కేసులు, జాగ్రత్తలు పాటించకపోతే బాధపడాల్సిందే
Eye Conjunctivitis: హైదరాబాద్ లో కండ్లకలక కేసులు విజృంభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరిగిపోతున్నాయి.
Eye Conjunctivitis: ఎడతెరిపిలేని వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. కండ్లకలక కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తేమతో కూడిన వాతావరణం వల్ కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కంటి ఇన్ఫెక్షన్ లు విపరీతంగా వ్యాపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కండ్లకలక కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కంటి శుభ్రత పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో కండ్లకలక కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కండ్ల కలక ప్రాణాంతకం కానప్పటికీ దీని వల్ల కొన్ని రోజుల పాటు బాధపడాల్సి వస్తుంది. ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే వారంలో లక్షణాలు తగ్గిపోతాయి.
కండ్లకలక ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో కండ్లకలకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎడతెగని వర్షాలు, తేమతో కూడిన వాతావరణం, కలుషిత నీరు.. ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ వ్యాప్తి చెందేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తాయి. వీటి వల్లే కంటి ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. కండ్లకలక త్వరగా వ్యాపిస్తుంది. కండ్లకలక వ్యాధి బారిన పడిన వ్యక్తులు తాకిన వాటిని తాకడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది.
కండ్లకలక లక్షణాలు
- కళ్లు ఎర్రబడటం
- కంటి నుంచి నీరు కారడం
- కళ్లలో దురద, అసౌకర్యం
- గొంతు నొప్పి, జ్వరం (అరుదు)
- కళ్ల నుంచి తెలుపు పదార్థం
- రెప్పలు ఉబ్బడం
కండ్ల కలక నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కండ్లకలక రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా చేతులు, ముఖం కడుక్కోవాలి. కళ్లను తరచూ తాకకూడదు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. కండ్ల కలక వచ్చిన వారు నలుపు రంగు కళ్లద్దాలు వాడటం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే కంటిని దుమ్ము ధూళి నుంచి రక్షించుకునేలాంటి కళ్లద్దాలు వాడటం మంచిది. కళ్లను తాకి చేతిని శుభ్రం చేసుకోకుండా పరిసరాలను తాకడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది.
నీటి వల్ల కూడా కండ్లకలక వస్తుంది
కలుషిత నీటితో ముఖం కడుక్కునే సమయంలో ఆ నీరు కంటిలోకి చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది. వర్షాకాలంలో గాలిలో ఫంగస్, ఇతర అలెర్జీ కారకాలు ఎక్కువగా ఉంటాయి. తేమ, తడి వాతావరణంలో బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అలాంటి పరిసరాలను చేతితో తాకి ఆ చేతిని శుభ్రం చేసుకోకుండా కళ్లు ముట్టుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే తరచూ కళ్లను తాకకుండా నియంత్రించుకోవాలి.
Also Read: Semi Conductor: సెమీకండక్టర్ తయారీలో భారత్ ఎక్కడ ఉంది? ముందున్న సవాళ్లేంటి?
పరిశుభ్రత పరమౌషధం
పరిశుభ్రంగా ఉండటం వల్ల చాలా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అపరిశుభ్రంగా ఉండే పరిసరాల్లో బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయి. అలాంటి పరిసరాల్లో తిరిగే దోమలు, ఈగల వల్ల ఆయా సూక్ష్మక్రిములు వాతావరణంలో కలిసిపోతాయి. సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఉన్న పరిసరాలను చేతితో తాకి.. ఆ చేతులను శుభ్రం చేసుకోకుండా కళ్లను తాకితే ఇన్పెక్షన్ వ్యాపిస్తుంది. కుండీలు, పాత టైర్లు, నీరు నిలిచే చోట్ల నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలాగే నీరు నిలిచే ప్రాంతాల్లో క్రిమి సంహారక మందులు చల్లుకోవాలి. ఇంట్లో దుమ్ము ధూళి చేరి ఎక్కువ రోజులు నిలిచే స్థలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలాగే టీవీ స్క్రీన్లు, సోఫాలు, కుర్చీల కింద శుభ్రం చేసుకుంటూ ఉండాలి.