కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ
ఓ దొంగ ముఖానికి మాస్క్ వేసుకుని పట్టపగలే అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోకి దర్జాగా వచ్చాడు. ఓ ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడు. మహిళ డోర్ తెరవగానే ఆమెతో మాటలు కలిపి ఓ రెండడుగులు లోపలికి వేసి ఆమె మెడలో చైన్ తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన మహిళ వెంటనే స్థానికులను అప్రమత్తం చేస్తూ కేకలు వేస్తూ దొంగ వెంట పరుగెత్తింది. అయినా ఫలితం లేకపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్షికోట్ సన్‌సిటీలోని ఓ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులోకి గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి వచ్చాడు. ఓ ప్లాట్ ముందు నిలబడి డోర్ బెల్ కొట్టాడు.కాసేపటికి ఓ మహిళ డోర్ తెరవగా.. మాటలు కలిపి నెమ్మదిగా లోపలకి వెళ్లి ఒక్కసారిగా ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. దీంతో మహిళ వెంటనే తేరుకుని లబోదిబోమంటూ కేకలు వేస్తూ దొంగ వెంట పరుగెత్తింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.





















