KCR: వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
BRS: బీఆర్ఎస్ పై సొంత నేతలే వ్యతిరేకత ప్రచారం చేశారని కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు. కార్యకవర్గ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

KCR Comments: ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ కు చెందిన కొంత మంది ముఖ్య నేతలు వ్యతిరేక ప్రచారం చేశారని కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ భవిష్యత్ కష్టమని ప్రచారం చేయడంతో నైరాశ్యంతో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని అన్నారు. ఉద్యమంలో పుట్టిన పార్టీ అని .. ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదన్నారు.
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం చర్యలు
తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వహించిన తెలంగాణ ప్రజల పార్టీ బి ఆర్ ఎస్ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గతం గాయాలనుండి కోలుకున్న తెలంగాణాను తిరిగి అవే కష్టాలపాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. పార్టీని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని పాల్గొన్న నాయకులకు అధినేత దిశా నిర్దేశం చేశారు.
పార్టీ సభ్యత్వం ఇంచార్జ్ గా హరీష్ రావు
పార్టీ ఆవిర్భవించి 25వ సంవత్సరం లోకి అడుగిడుతున్న నేపధ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది కాలం పాటు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్ట పరచాలన్నారు. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీ లను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంబించాలని నిర్ణయించారు. సభ్యత్వ కార్యక్రమానికి ఇంచార్జ్ గా హరీష్ రావును నియమించారు.
ఉపఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి !
తెలంగాణలో ఖచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. సాధించుకున్న తెలంగాణ వెనక్కి పోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని.. మళ్లీ ఆ పార్టీ లేచే ప్రశ్నే లేదన్నారు. పాతికేళ్ల స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టు నిలుపుకునేలా ప్రయత్నించాలన్నారు.
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ప్రసంగించిన తర్వాత పార్టీల నేతలతో సంభాషించారు. వారు చెప్పిన మాటల్ని ఆలకించి.. వాటికి సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే కొంత మంది పార్టీ నేతలు చేసిన వ్యతిరేక ప్రచారం గురించి ప్రస్తావించారు. ఆ పార్టీ నేతలు ఎవరు అన్నదానిపై కేసీఆర్ కు సమాచారం ఉన్నా ఆయన నేరుగా ఎవరి పేరు పెట్టి చెప్పలేదని తెలుస్తోంది. పార్టీ కార్యకవర్గానికి భవిష్యత్ పై నమ్మకం కల్పించి.. పోరాటాల దిశగా దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

