BRS: బీఆర్ఎస్ బహిరంగసభ మరింత ఆలస్యం - ఏప్రిల్ 27వ తేదీ ఖరారు !
Telangana: ఏప్రిల్ 27వ తేదీన బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

BRS Public Meeting: ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభను నిర్వహించ నున్నట్లు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏడాది పొడవునా ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించాలని శ్రేణులకు సూచించారు.
అలాగే, పార్టీ కమిటీలు వేయాలని నిర్ణయించిన కేసీఆర్.. కమిటీలకు ఇన్‌చార్జ్‌గా హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మహిళా కమిటీ లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ పదో తేదీ నుంచి బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని.. ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగు తుందన్నారు. అనుబంధ సంఘాల పటిష్టత కోసం సీనియర్ నేతలతో సబ్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. అదే నెల 10న పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్‌ఎస్ అన్నారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వహించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్‌ఎస్ అని తెలిపారు. తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గతం గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలస వాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని.. ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులకు అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భవించి 25వ సంవత్సరం లోకి అడుగిడుతున్న నేపధ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది కాలం పాటు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్ట పరచాలన్నారు. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీ లను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలన్నారు.
తెలంగాణ అస్థిత్వ పార్టీ బీఆర్‌ఎస్ అని కేసీఆర్ అన్నారు. గత గాయాల నుంచి కోలుకున్న రాష్ట్రాన్ని మళ్లీ అదే స్థితికి కాంగ్రెస్ నేతలు తీసుకు వెళుతున్నారని.. మరోసారి దోపిడీ, వలస వాదుల బారిన పడకుండా తెలంగాణను కాపాడాలన్నారు. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్‌ఎస్ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడి పోతుందన్న కేసీఆర్.. సీఎంపై ప్రజల్లో ఇంతలా వ్యతిరేకత ఇంత తొందరగా వస్తుందను కోలేదన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడి పోతుందని.. మనం ఏటా ఆదాయం పెంచుకుంటూ వెళ్లామన్నారు. అదే అధికారులు ఉన్నారు కానీ.. ఈ ప్రభుత్వానికి పని చేయించుకోవడం రావడం లేదన్నారు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

