Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
TTD News: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

TTD Changed Srivani Tickets Release Dates: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుంచి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మార్చి నెలకు సంబంధించి శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఆ తేదీల్లో మార్పులు
మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను ఈ నెల 25న ఉదయం 11 గంటలకు, మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 26న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను సైతం విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ మార్పును భక్తులు గమనించాలని.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.gov.in లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
భక్తుల రద్దీ
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం లభిస్తోంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 58,165 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా.. 20,377 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.
అందుబాటులో తిరుమల డైరీలు
ప్రతి ఏటా తిరుమలలో డిసెంబర్ నెలలో కొత్త క్యాలెండర్లు, డైరీలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈసారి తిరుమలకు రాని భక్తులు కూడా వీటిని పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్‌లైన్‌లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉంచింది. అటు, టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ వీటిని అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి పోస్టల్ ద్వారా వారి ఇంటి వద్దకే వీటిని అందిస్తారు. www.tirumala.org, ttdevasthanams.ap.gov.inలో నిర్ణయించిన ధరల మేరకు వీటిని కొనుగోలు చేయవచ్చు. టీటీడీ ఎంపిక చేసిన తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు వంటి ప్రధాన కళ్యాణమండపాల్లో క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

