CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Andhra News: ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతం పరిశీలించిన మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

AP CM Chandrababu Good News To Farmers: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే, రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం పరిశీలించిన అనంతరం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఒక రోజు మందుగానే రైతులకు ధాన్యం డబ్బులు ఇస్తే మరింత సంతోషిస్తారని అన్నారు. కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును శుక్రవారం ఆయన పరిశీలించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రైతుల నుంచి ధాన్య సేకరణ ఎలా చేస్తున్నారో సీఎంకు రైతు సేవాకేంద్రం సిబ్బంది వివరించారు. అనంతరం తాము ధాన్యం ఎలా అమ్ముతున్నది సీఎంకు రైతులు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది పంట ఎక్కువగా వచ్చిందని, మిషన్ కోత వల్ల ఎకరానికి అయిదారు వేలు కలిసి వచ్చిందని చెప్పారు.
కోసిన గడ్డిని బయోఫ్యూయల్ ప్లాంట్ వాళ్లు తీసుకుంటే మరో రూ.5 వేల వరకూ వస్తుందని రైతులకు సీఎం తెలిపారు. ధాన్యం కొన్న 48 గంటల్లోనే డబ్బులు జమ అవుతున్నాయా అని సీఎం అడగ్గా... డబ్బులు కరెక్టుగానే వస్తున్నాయని రైతులు సమాధానమిచ్చారు. ప్రోక్యూర్మెంట్‌కు షెడ్యూలింగ్ మొత్తం ఒకటిగా లేదా... వేర్వేరుగా పంట కోత కోస్తే పార్ట్ షెడ్యూలింగ్ ఇస్తామని సీఎంకు సేవా కేంద్రం సిబ్బంది వివరించారు. సాగు చేస్తున్న పొలాన్ని బట్టి రైతుకు దిగుబడి ఎంత వస్తుందో కూడా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ధాన్యం తేమ శాతాన్ని ఎలా గణిస్తారో స్వయంగా పరిశీలించారు.
'యాంత్రీకరణ పెరిగితేనే..'
తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. 'తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమవుతున్నాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే మా సంకల్పం.' అని పేర్కొన్నారు.
'ఒక రోజు ముందుగానే డబ్బులు'
రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం పరిశీలించిన అనంతరం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక రోజు మందుగానే రైతులకు ధాన్యం డబ్బులు ఇస్తే మరింత సంతోషిస్తారని అన్నారు. 'రైతులతో మాట్లాడేందుకే నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా. ఏ పంట పండిస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో రైతులు ఆలోచించుకోవాలి. భూమి, వాతావరణ పరిస్థితులు అంచనా వేసుకుని పంట సాగు చేయాలి. నీళ్లు సరైన సమయంలో ఇవ్వకపోవడంతోనే రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షాలతో అప్పులపాలవుతున్నారు. గత ఐదేళ్లలో కాలువల్లో పూడిక తీయలేదు. పట్టిసీమ ద్వారా సకాలంలోనే వరినాట్లకు నీరందిస్తాం. వ్యవసాయం మన సంస్కృతి, వ్యసనం. ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు కోరిన విధంగా డ్రయర్ మిషన్లు పొలం వద్దకే పంపే ఏర్పాటు చేస్తాం.’ అని సీఎం స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

