AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Andhra News: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అన్ని పోర్టుల్లోనూ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Heavy Rains In AP Districts: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం 12 గంటల్లో ఉత్తరం వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటు 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది. వాయుగుండం బలపడి అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లోనూ దాని తీవ్రత కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. మరో 2 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. అటు.. కళింగపట్నం - మచిలీపట్నం వరకూ అన్ని పోర్టుల్లోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు వెల్లడించారు.
ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
వాయుగుండం ప్రభావంతో కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు, రాష్ట్ర హోంమంత్రి అనిత.. వర్షాలపై అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు హెచ్చరించే సందేశాల ద్వారా ప్రజలు, రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

