Superstar Krishna Death : కృష్ణ సంపాదనే కాదు, సంతానమూ సినిమాల్లోనే - మూడో తరం & రాజకీయం, కృష్ణ లైఫ్‌లో కొన్ని
Super Star Krishna Family : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణది చెరగని ముద్ర. 350కు పైగా సినిమాలు చేసిన ఆయన... మూడో తరాన్ని కూడా పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ విశేషాలు...
![Superstar Krishna Death : కృష్ణ సంపాదనే కాదు, సంతానమూ సినిమాల్లోనే - మూడో తరం & రాజకీయం, కృష్ణ లైఫ్‌లో కొన్ని Superstar Krishna Death Unknown Facts of Krishna About Filmography, Political Career, Lifestyle Superstar Krishna Death : కృష్ణ సంపాదనే కాదు, సంతానమూ సినిమాల్లోనే - మూడో తరం & రాజకీయం, కృష్ణ లైఫ్‌లో కొన్ని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/d7258cf6d483738c6c90a8c85ad1ec061668474122465313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కథానాయకుడు...
సాహసాలకు వెరవని ధీరుడు...
తెలుగు తెరపై తొలి జేమ్స్ బాండు...
అల్లూరిగా విప్లవ స్ఫూర్తి చూపిన వీరుడు...
తెలుగు సినిమా 'సింహాసనం'లో నటశేఖరుడు...
ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ సూపర్ స్టార్‌గా నిలిచే నటుడు...
భువి నుంచి దివి వెళ్ళాడు!
కథానాయకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, దర్శకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నతికి కృషి చేసిన కథానాయకుడు కృష్ణ (Super Star Krishna). సినిమాల్లో మాత్రమే కాదు... రాజకీయాల్లోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. మూడు వందల యాభైకు పైగా సినిమాలు చేసిన కృష్ణ... తన కుటుంబంలోనూ మూడో తరాన్ని కూడా సినిమాలోకి తీసుకు వచ్చారు. ఆయన లైఫ్‌లో కొన్ని ముఖ్యమైన విశేషాలు...
బుర్రిపాలెం నుంచి
మద్రాసు బండెక్కి!
గుంటూరు జిల్లాలోని తెనాలి దగ్గరలో గల బుర్రిపాలెంలో మే 31, 1943లో కృష్ణ జన్మించారు. నటనపై ఆసక్తితో 19 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. హీరోగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తన తండ్రికి స్నేహితుడైన వాహినీ స్టూడియోస్ అధినేత చక్రపాణి, ఆయన ద్వారా ఎన్టీఆర్, ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ తదితరులను కలిశారు. వాళ్ళ సలహాతో తొలుత నాటకాలు వేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు.
'తేనెమనసులు' నుంచి
'శ్రీ శ్రీ'తో వరకూ స్టార్‌గా!
'తేనెమనసులు' సినిమాతో తెలుగు తెరకు కృష్ణ కథానాయకుడిగా (Krishna First Movie As Hero) పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 350కు పైగా సినిమాలు చేశారు. ఆయన నటించిన చివరి సినిమా 'శ్రీ శ్రీ' (Krishna Last Movie). 2016లో విడుదలైంది. ఆయన 18 ఏళ్ళ పాటు ఏడాదికి పది కంటే ఎక్కువ సినిమాలు చేశారు.
కథానాయకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన కృష్ణ, ఆ తర్వాత పెద్ద కుమార్తె పద్మావతి పేరు మీద పద్మాలయ స్టూడియోస్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. 'సింహాసనం' సినిమాతో దర్శకుడిగా మారారు. అంత కంటే ముందు 'అల్లూరి సీతారామరాజు'కు ఘోస్ట్ డైరెక్షన్ చేశారు. దర్శకుడు వి. రామచంద్రరావు చిత్రీకరణ మధ్యలో కన్ను మూయడంతో ఆయన కోరిక మేరకు మిగతా చిత్రాన్ని తన దర్శకత్వంలో పూర్తి చేసిన కృష్ణ... దర్శకుడిగా ఆయన పేరు వేశారు.
'తేనెమనసులు', 'గూఢచారి 116', 'అల్లూరి సీతారామరాజు', 'గూడుపుఠాణి', 'భలే దొంగలు', 'సింహాసనం', 'పాడిపంటలు', 'దేవుడు చేసిన మనుషులు', 'కురుక్షేత్రం', 'మోసగాళ్లకు మోసగాడు' వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు కృష్ణ ఖాతాలో ఉన్నాయి. తెలుగులో అనేక ప్రయోగాలకు ఆయన శ్రీకారం చుట్టారు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి కలర్ సోషల్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి ఈస్టమన్ కలర్ సినిమా, తొలి 70ఎంఎం సినిమాలు తీసింది ఆయనే.
Also Read : కృష్ణ ఇక లేరు - ఆయన బాల్యం, ఇండస్ట్రీలోకి రాకముందు జీవితం గురించి తెలుసా?
చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను కృష్ణను 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇంకా ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి.
కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరున, మరో విజయ నిర్మల జూన్ 27, 2019న మరణించారు. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ ఏడాది జనవరిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయనకు ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు.
తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్!
కృష్ణ చిన్న కుమారుడు మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. పెద్ద కుమారుడు, దివంగత రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. తమ్ముడు మహేష్ హీరోగా 'అర్జున్' వంటి సినిమా నిర్మించారు. మంజుల కొన్ని సినిమాల్లో నటించారు. 'షో' సినిమా ఆమెకు పేరు తెచ్చింది. తమ్ముడు మహేష్ హీరోగా 'పోకిరి', 'నాని'తో పాటు 'ఏ మాయ చేసావె', ఇంకొన్ని సినిమాలు నిర్మించారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మనసుకు నచ్చింది'తో ఆమె దర్శకురాలిగా పరిచయం అయ్యారు. చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాల్లో కృష్ణ కుటుంబంలో మూడో తరం...
కృష్ణ కుటుంబంలో మూడో సంతానం కూడా పరిశ్రమలో ప్రవేశించింది. పెద్ద కుమార్తె పద్మావతి కుమారుడు అశోక్ గల్లా 'హీరో' సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమాను పద్మావతి నిర్మించారు. 'వన్ నేనొక్కడినే'లో మహేష్ కుమారుడు గౌతమ్, 'సర్కారు వారి పాట' సినిమాలోని 'పెన్నీ పెన్నీ...' పాటలో మహేష్ కుమార్తె సితార కనిపించారు. 'మనసుకు నచ్చింది'లో మంజుల కుమార్తె జాన్వీ నటించారు.
రాజీవ్ పిలుపుతో రాజకీయాల్లోకి...
ఇందిరా గాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీతో కృష్ణకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రాజీవ్ పిలుపుతో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏలూరు పార్లమెంట్ నియోకవర్గం నుంచి 1989లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 1991లో రాజీవ్ హత్య తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించారు గానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. విజయ నిర్మల తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె కూడా రాజకీయాల వైపు చూడలేదు. కృష్ణ పెద్ద అల్లుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో కీలక నేత. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఎంపీ.
Also Read : ఏలూరు ఎంపీ సూపర్ స్టార్ కృష్ణ - రాజకీయాల్లోనూ స్టారే !
కృష్ణ వారసుడిగా సినిమాల్లో స్టార్‌డమ్ కంటిన్యూ చేస్తున్న మహేష్, రాజకీయాల్లోకి కూడా రావాలని కొంత మంది కోరారు. అయితే... తనకు అటువంటి ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాల్లో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న మహేష్, రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధికి పాటు పడుతున్నారు. సేవకు ముందు ఉండే ఆయన, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)