Telangana MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు- అభ్యర్థికి కలిసొచ్చిన సేవలాల్ జయంతి, బ్యాలెట్‌లో లక్కీ నెంబర్ సొంతం
Adilabad News | ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి అవినాష్ జాదవ్ ప్రచారం మొదలుపెట్టారు. తనను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు.

ఆదిలాబాద్: అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డలు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు నడుస్తున్నారు. మారుమూల గ్రామంలో పుట్టిన ఓ బిడ్డ, పెరిగింది అడవుల్లోనే అయినా ఉన్నత విద్యనభ్యసించి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎదిగారు. ప్రస్తుతం మల్లారెడ్డి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగారు. అయనే అవినాష్ జాదవ్. ఇంతకీ ఈ అవినాష్ జాదవ్ కథేంటీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఎందుకు పోటి చేస్తున్నారో పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
ఆదిలాబాద్ జిల్లాలో ఏంతో మంది అడవుల్లో ఉంటూనే తమ స్కూల్ చదువు అక్కడే పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం ఇతర జిల్లాలకు వెళ్లి చదువులకు పెద్ద పీట వేసేలా ఉన్నత చదువులు చదివి ప్రొఫెసర్ గా ఎదిగారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఛీఛ్ ధరి, ఖానాపూర్ గ్రామంలో పుట్టిన గిరిజన బిడ్డ అవినాష్ జాదవ్.. పుట్టింది అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామమైన ఖానాపూర్ కానీ, ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతూ అంచలంచెలుగా ఎదిగారు. నేడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తూనే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఓ గిరిజన బిడ్డ తొలిసారిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తనకు అందరి సహకారం కోరుతున్నారు. తాను పుట్టిన మారుమూల కొండ ప్రాంతమైన ఖానాపూర్ అయినప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి నిలిచానని అవినాష్ జాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను నిలవగా, బ్యాలెట్ లో తనకు 15వ నంబరు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి 15వ తేదీన ఉండడం తనకు కలిసి వస్తుందన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతోనే 15వ తేదీ నుంచి తాను పుట్టిన ఖానాపూర్ గ్రామం నుండి ప్రచారం మొదలుపెట్టారు. తన తల్లిదండ్రుల కృషి వల్లే కొండల ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తూ.. చిచ్ ధరి, ఖానాపూర్ నుండి నిర్మల్ లోని సారంగాపూర్ ప్రాంతం వరకు ఉపాధి నిమిత్తం వెళ్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదివినట్లు తెలిపారు. నేడు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నా.. సొంత గడ్డకు ఏదైనా చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను పోటీకి నిలిచానని తెలిపారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అట్టడుగు వర్గాల ప్రజలు, ఉద్యోగులు గ్రాడ్యుయేట్లు తమ సమస్యల కోసం ప్రశ్నించే గొంతుకగా అవినాష్ జాదవ్ ను గెలిపించాలని కోరారు. ‘ఎన్నో కష్టాలు అనుభవించి నేడు ఈ స్థాయికి ఎదిగా. ఇదంతా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోనే సాధ్యమైంది. ప్రజలకు సేవ చేసేందుకు ఈ దారి ఎంచుకున్నాను. ఇది కాకపోయినా ఎప్పటికైనా లక్ష్యం చేరుకుంటా. యువత కూడా పట్టుదలతో శ్రమించాలని, కష్టపడితే ఏదైనా సాధ్యం. ఈ పట్టపద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గిరిజన బిడ్డనైన తనను గెలిపించాలని, తనకు అందరు కూడా అండగా నిలవాలని’ అవినాష్ జాదవ్ కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

