Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
Vamsi: వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఏం చెప్పబోతున్నారు.

Will Vallabhaneni Vamsi get station bail: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి.. విజయవాడకు తరలించారు. అయితే ఆయనను కోర్టులో ప్రవేశ పెడితే స్టేషన్ బెయిల్ వస్తుందేమో అని కొంత మంది టీడీపీ కార్యకరలే సోషల్ మీడియాలో సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో పలువురు వైసీపీ నేతల్ని సీరియస్ కేసుల్లో అరెస్టు చేసినా స్టేషన్ బెయిల్ వచ్చేలా చేశారు. చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పై హత్యాయత్నం కేసు ఉన్నా సరే ఆయనను బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి తీసుకు వచ్చి మరీ తిరుపతి కోర్టులో హాజరు పరిచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు.
అందుకే ఇప్పుడు వల్లభనేని వంశీకీ స్టేషన్ బెయిల్ వస్తుందన్న సందేహం ఎక్కువ మందిలో ఉంది. కానీ పోలీసులు నమోదు చేసిన కేసులు తీవ్రమైనవే. వంశీపై BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఈ కేసులను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుంటే ఆయనకు స్టేషన్ బెయిల్ రాదు. జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై మూకదాడి జరిగింది. ఆ దాడిలో పలువురుకు గాయాలయ్యాయి. టీడీపీ ఆఫీసును తగులబెట్టారు. ఈ దాడిపై పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనను సాక్షిగా పిలిచి ఫిర్యాదుగా పోలీసులు మార్చారని ఆయన రివర్స్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన హాజరై ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
ఆ సమయంలో కోర్టు ఆవరణలో వంశీ కూడా కారులో ఉన్నారన్న ప్రచారం జరిగింది. కోర్టులో అఫివిడవిట్ సమర్పించిన అనంతరం కోర్టు నుంచి నేరుగా వెళ్లి వంశీని సత్యవర్ధన్ కలిశారు. ఆ తర్వాత సత్యవర్ధన్ ను వంశీ విశాఖకు పంపించారని పోలీసులు చెబుతున్నారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, బెదిరించారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విత్ డ్రా చేసుకోవాలని తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆయన ఎక్కడ ఉన్నారో కనిపెట్టిన పోలీసులకు సత్యవర్థన్ తెలిపారు.
మరో వైపు వల్లభనేని వంశీ అరెస్ట్ కారణంగా కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు కీలక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తోపాటు పోలీస్ యాక్ట్ – 30 అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలు పూర్తిగా నిషేధం అన్నారు. పోలీసుల నిషేదాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Also Read: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

