Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
Andhra Pradesh Latest News: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. సత్యవర్థన్ అనే వ్యక్తి కిడ్నాప్ కేసులో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

Vallabhaneni Vamsi Arrest: వైసీపీ లీడర్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన హైదరాబాద్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయ్‌దుర్గ్‌లో ఉన్న మైహోం భూజాలో ఉండగా వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన కేసులో వంశీకి ముందస్తు బెయిల్ కోర్టు మంజూరు చేసింది. ఆ కేసులో బెయిల్ ఉన్నందున అరెస్టు చేసే వీలు లేదు. ఈ దాడి విషయంలో కేసు పెట్టినందుకు తనపై కక్ష కట్టి కిడ్నాప్ చేశారని సత్యవర్థన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సత్యవర్థన్ టీడీపీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు సత్యవర్థన్ పెట్టిన కేసులోనే అరెస్టు చేసినట్టు సమాచారం.
కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఈయన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వల్లభనేని వంశీ సహా 88 మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఏ71గా ఉన్నారు. TDP కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలో నమోదైన కేసు చేశారు. అప్పట్లో ఆ కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేశారు.
సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్ధన్ బంధువులు వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 140 (1), 308, 351 (3), రెడ్‌విత్ 3(5) కేసులు నమోదు చేశారు. వల్లభనేని వంశీపై అట్రాసిటీ కేసులు పెట్టారు. గతంలో వల్లభనేని వంశీ పరారీలో ఉండటంతో ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు.
పరారీలో ఉన్న వంశీ హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించిన విజయవాడ పటమట పోలీసులు ఈ ఉదయం మైహోం భూజాకు చేరుకున్నారు. ఆయన్ని అరెస్టు చేస్తున్నట్టు భార్యకు నోటీసులు ఇచ్చారు. అనంతరం వంశీని అరెస్టు చేసి గచ్చిబౌలి నుంచి విజయవాడకు తరలించారు.
ఇంకెన్నాళ్లు కక్ష పూరిత రాజకీయాలు: వైసీపీ
ఇది అక్రమ కేసు అని కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వంశీని అరెస్టు చేసిందని వైసీపీ ఆరోపించింది. సోషల్ మీడియాలో స్పందించిన ఆ పార్టీ... మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టును ఖండించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై వంశీ ఉన్నారని గుర్తు చేసింది. సత్యవర్ధన్ ఇటీవలే ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకున్నట్టు తెలిపింది. కానీ.. మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. విజయవాడకు అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొంది. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలకు చంద్రబాబు పాల్పడతారని ప్రశ్నించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

