కేరళ నుండి వచ్చిన బాదుషా సమీనా దంపతులు కోనసీమ జిల్లా శిశు గృహంలో ఉన్న 15 నెలల పాప సంజనను దత్తత తీసుకున్నారు.
Konaseema News: కన్న ప్రేమ కాదంది! కనని ప్రేమ కేరళ రమ్మంది!ఆడ బిడ్డ దత్తత కోసం కేరళ నుంచి కోనసీమకు వచ్చిన దంపతులు!
Konaseema News: కోనసీమ శిశు గృహ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 15 నెలల పాప సంజనను జిల్లా కలెక్టర్ సమక్షంలో దత్తత స్వీకరించేందుకు కేరళ నుంచి కోనసీమకు వచ్చారు ఓ జంట.

Konaseema News: కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది అంటారు. అందుకే కాబోలు పేగు తెంచుకు పుట్టకపోయినా పాపంటే ప్రాణంగా భావించారా దంపతులు. కన్న బంధం కాదనుకున్నా కంటికి రెప్పలా కాపాడుకునేందుకు మేమున్నామంటూ వచ్చారు. కోనసీమలో ఆడబిడ్డ దత్తత స్వీకరించేందుకు ఉందని ఆన్ లైన్ ద్వారా తెలుసుకుని కేరళ నుంచి రెక్కలు కట్టుకుని వాలిపోయారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శిశు గృహ ఏర్పాటైన తరువాత మొట్టమొదటిగా ఆడపిల్లను దత్తత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన దత్తత స్వీకారానికి ఏకంగా కేరళ రాష్ట్రం నుంచి మిస్టర్ బాదుషా సమీనా దంపతులు కోనసీమ జిల్లాకు వచ్చారు. కోనసీమ శిశు గృహ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 15 నెలల పాప సంజనను దేశవ్యాప్తంగా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పిల్లలలేని దంపతులకు పిల్లలు దత్తత ఇచ్చే కార్యక్రమం అమలాపురం కలెక్టరేట్ లోని కలెక్టర్ మహేష్ కుమార్ సారధ్యంలో నిర్వహించారు.
కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న దంపతులు..
ఆన్లైన్ ప్రాధాన్యతలో కేరళకు చెందిన మిస్టర్ బాదుషా సమీనా దంపతులు ఎంపిక అయ్యారు. జిల్లాకు వచ్చి ప్రక్రియలు పూర్తి చేసి పాపను దత్తత తీసుకోవచ్చని ఐసీడీఎస్ అధికారులు సూచించడంతో ఎంతో సంతోషంతో వారు కేరళ నుంచి వెంటనే కోనసీమ జిల్లాకు వచ్చారు. ఆన్ లైన్ ప్రక్రియలోనే అన్ని నిబంధనలు సంతోషంతో అంగీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లో అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక వారికి చిన్నారి సంజనను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అప్పగించారు. సంజనను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కలెక్టర్‌కు దంపతులు హామీ ఇచ్చారు.
సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ద్వారా సంప్రదించి..
పిల్లలు లేని దంపతులు.. లేదా దత్తత స్వీకరించాలన్న సదుద్దేశం ఉన్న వారు ఎవ్వరైనా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అధారిటీ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు దత్తత స్వీకరించబోయే బిడ్డకు ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు, వారి ఆర్థిక స్థితి.. వ్యక్తిత్వం.. వారి బ్యాక్‌గ్రౌండ్, ఇలా అనేక అంశాల్లో ఆ ప్రాంతాల్లోని అధికారుల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది.. సరిగ్గా కేరళకు చెందిన బాదుషా సమీనా దంపతులు ఇలానే ఆన్‌లైన్‌లో చూసి దరఖాస్తుచేసుకున్నారు. అందులో వీరికే మొదటి ప్రాధాన్యత లభించడంతో సంతోషంతో కేరళ నుంచి కోనసీమ జిల్లాకు వచ్చారు.
అసహాయ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు; కలెక్టర్
జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ కోనసీమ జిల్లా శిశు గృహం ద్వారా దేశవ్యాప్తంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న పిల్లలు లేని దంపతులకు పిల్లల దత్తత కార్యక్రమం చట్టబద్ధంగా సమర్థవంతంగా నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అసహాయ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడం జరుగుతుందన్నారు. పిల్లలను కన్నబిడ్డలుగా ప్రేమతో చూసుకుని, వారికి మంచి విద్య, భవిష్యత్తు అందించాలని దత్తత తీసుకున్న దంపతులకు సూచించారు. జిల్లా శిశు గృహం ఈ ప్రక్రియలో దత్తత తీసుకునే వారికి పూర్తిగా సహకార అందిస్తున్నారు. దయచేసి ఈ పవిత్ర ప్రయత్నంలో పాల్గొని పిల్లలు లేని దంపతులు శిశు గృహ చిన్నారులను దత్తత తీసుకోవాలన్నారు. ఈ శిశు గృహం ద్వారా సామాజిక న్యాయం, పిల్లల సంక్షేమానికి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దంపతుల అభీష్టాలు సఫలమవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి కె నాగమణి, జిల్లా చైల్డ్ ప్రొడక్షన్ అధికారి బి ఉమా లక్ష్మి ప్రొటెక్షన్ ఆఫీస్ నాన్ ఇన్స్టిట్యూషన్ కేర్ శిరీష, శిశు గృహ మేనేజర్ ఎం వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.
Frequently Asked Questions
కేరళ నుండి వచ్చిన దంపతులు ఏ పాపను దత్తత తీసుకున్నారు?
దత్తత ప్రక్రియ ఎక్కడ జరిగింది?
దత్తత ప్రక్రియ అమలాపురం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ సారధ్యంలో జరిగింది.
దత్తత తీసుకోవాలనుకునేవారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
పిల్లలు లేని దంపతులు లేదా దత్తత స్వీకరించాలనే సదుద్దేశం ఉన్నవారు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA) పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దత్తత ప్రక్రియలో అధికారులు దంపతుల గురించి ఏమి పరిశీలిస్తారు?
దత్తత తీసుకోబోయే బిడ్డకు ఎటువంటి భరోసా ఇవ్వగలరు, వారి ఆర్థిక స్థితి, వ్యక్తిత్వం, మరియు బ్యాక్గ్రౌండ్ వంటి అనేక అంశాలను అధికారులు పరిశీలిస్తారు.























