![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Krishna Political Life : ఏలూరు ఎంపీ సూపర్ స్టార్ కృష్ణ - రాజకీయాల్లోనూ స్టారే !
రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ కృష్ణ తనదైన ముద్ర వేశారు. ఓ సారి ఏలూరు ఎంపీగా గెలిచారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారు.
![Krishna Political Life : ఏలూరు ఎంపీ సూపర్ స్టార్ కృష్ణ - రాజకీయాల్లోనూ స్టారే ! Superstar Krishna also made his mark in politics. He won as Eluru MP once. Krishna Political Life : ఏలూరు ఎంపీ సూపర్ స్టార్ కృష్ణ - రాజకీయాల్లోనూ స్టారే !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/03564382d4df8114f7a79237c15d273a1668437584169228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Political Life : సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ. సినీ పరిశ్రమలో ఎలాంటి కొత్త మార్పు తేవాలన్నా ముందుగా ఆయనే అడుగు వేస్తారని చెబుతారు. అలాంటి డేరింగ్ కృష్ణ రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. కానీ కొంచెం కాలమే. ఆయన లోక్‌సభ మాజీ ఎంపీ ఈ తరంలో చాలా మందికి తెలియదు. అప్పట్లో ఆయన రాజకీయ పోరాటం ఓ రేంజ్‌లో ఉండేది. ఆ వివరాలు మీ కోసం.
మొదట్లో ఎన్టీఆర్‌కు సపోర్ట్.. తర్వాత విరోధం !
సినీ పరిశ్రమ నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయనకు సినీపరిశ్రమ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎన్టీఆర్ తొలి ఎన్నికలు ఎదుర్కొనే ముందు ఈనాడు అనే సినిమాను తీశారు. అది తెలుగుదేశం పార్టీ విధానాలకు అనుకూలంగా ఉండటంతో.. టీడీపీకి ప్లస్ అయింది. అయితే తర్వాత ఏం జరిగిందో కానీ.. కృష్ణ ఎన్టీఆర్‌కు దూరమయ్యారు. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ సమయంలో కృష్ణ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఫుల్ పేజీ పేపర్ ప్రకటన ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ -కృష్ణ ప్రత్యర్థులయ్యారు.
రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణకు స్నేహం !
ఇందిరా గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణకు స్నేహం కుదిరింది. ఎన్టీఆర్‌ను అప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తూండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను ప్రోత్సహించింది. ఎన్టీఆర్ లాంటి ఛరిష్మా ఉన్న నేతకు.. కృష్ణ ధీటైన సమాధానం చెప్పగలరని భావించింది. కృష్ణ కూడా.. ఎన్టీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. కొన్ని కొన్ని సినిమాల విడుదలకు ఆటంకాలు కూడా ఎదురయ్యేవి. అయితే కృష్ణ మాత్రం వెనక్కి తగ్గలేదు. తర్వాత నేరుగా ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో 1989లో ఏలూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసి 71వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో రెండేళ్లకే మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1991లో మధ్యంతర ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆయనను గుర్తించే వారు తగ్గిపోయారు. గుంటూరు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపినా ఎవరూ పట్టించుకోలేదని.. చెబుతారు.
ఆ తర్వాత పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిన సూపర్ స్టార్ !
ఆప్తమిత్రుడైన రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడం.. తర్వాత వచ్చిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కృష్ణ విలువను గుర్తించకపోవడంతో .. ప్రత్యక్ష రాజకీయాల నుంచి సూపర్ స్టార్ దూరమయ్యారు. తరవాత సినీ పరిశ్రమకే అంకితం అయ్యారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉన్నారు. మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ సానుభూతిపరులుగానే ఉన్నారు. చివరి వరకూ ఆయనది కాంగ్రెస్ పార్టీనే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)