AP CM Chandrababu: భువనేశ్వరి అంత మొండి ఘటం- తమన్, పవన్‌లకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు
NTR Trust Euphoria Musical Night in Vijayawada | దివంగత సీఎం ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో ఆయన కూతురు, తన సతీమణి భువనేశ్వరి అంతే మొండి ఘటం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

Andhra Pradesh News | అమరావతి: తన సతీమణి నారా భువనేశ్వరిపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత సీఎం ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో తన భార్య భువనేశ్వరి అంతే మొండి ఘటం అన్నారు. ఆమె హెరిటేజ్ ని మాత్రమే కాదు సేవల కోసం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust)ను సమర్ధవంతంగా నడిపిస్తుందని భువనేశ్వరిని చంద్రబాబు కొనియాడారు.
తెలుగు జాతి ఉన్నంతవరకు సేవలు
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం రాత్రి యుఫోరియా మ్యూజికల్ నైట్ Euphoria Musical Night)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. సమాజం కోసం కృషి చేసిన నేత ఎన్టీఆర్. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవారు. కర్నూలు కరువు, దివిసీమ తుఫాన్ వంటి విపత్తుల్లో ఎన్టీఆర్ ముందుండి విరాళాలు సేకరించారు. బాధ, ఆవేదన నుంచి పుట్టిందే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. 28 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తోంది. తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు కొనసాగుతాయి. తాగు నీరు, విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ సహా పలు రంగాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.
బాలకృష్ణ, భువనేశ్వరిని చూస్తే గర్వంగా ఉంది
‘తల్లిపేరుతో ఏర్పాటుచేసిన బసవతారకం ఆస్పత్రి ద్వారా నందమూరి బాలకృష్ణ, తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి సేవలు అందిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. పుణ్య దంపతులకు దక్కిన గౌరవమే బాలకృష్ణ నిర్వహిస్తున్న క్యాన్సర్ హాస్పటల్, భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్. క్యాన్సర్‌తో బసవతారకం చనిపోతే.. బాలకృష్ణ తన తల్లి పేరిట బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు హాస్పిటల్ సేవలందిస్తోంది. ప్రమాదాల్లో, ఫ్యాక్షన్ గొడవల్లో టీడీపీ కుటుంబసభ్యులు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆదుకుంటున్నారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్య శిక్షణ, మహిళా సాధికారత, విపత్తుసాయం లాంటి కార్యక్రమాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు విస్తరించామని’ చంద్రబాబు తెలిపారు.
తమన్, పవన్‌లకు అభినందనలు
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియాతో బాధ పడుతున్న 250 మంది చిన్నారులకు ఇప్పటికే వైద్యసాయం అందిస్తున్నారు. మరికొందర్నీ ఆదుకునేందుకు ఈవెంట్ చేయడం గొప్ప విషయం. ఈ మంచిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భాగస్వామిగా మారినందుకు సంతోషంగా ఉందన్నారు. ఒక్క రూపాయి తీసుకోకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన ఈవెంట్ చేస్తానని ముందుకు వచ్చినందుకు తమన్‌ను చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం రూ.50 లక్షలు విరాళం ప్రకటిచారు. ఓ మంచి పనికోసం ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రతి ఒక్కరూ వారి సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఖర్చుచేసి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

