Krishnaveni Passed Away: ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత, నటి కృష్ణవేణి మృతి
Actress Producer Krishnaveni Death News: అలనాటి నటి, నందమూరి తారక రామారావును చిత్రసీమను పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి మృతి చెందారు.

Veteran actress Krishnaveni passed away: అలనాటి కథానాయిక, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావును తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి ఇకలేరు. ఈ రోజు (ఫిబ్రవరి 16, ఆదివారం) ఉదయం తుదిశ్వాస విడిచారు.
బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన కృష్ణవేణి
కృష్ణవేణి హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. ఆవిడ వయస్సు 102 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పంగిడి గూడెం గ్రామంలో డాక్టర్ కుటుంబం ఎర్రంశెట్టి లక్ష్మణ రావు, నాగ రాజమ్మకు దంపతులకు కృష్ణవేణి జన్మించారు. డిసెంబర్ 24,1924లో జన్మించిన ఆవిడ... బాల నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. తెలుగు వెండితెరపై అడుగు పెట్టడానికి ముందు నాటక రంగంలో తన ప్రతిభ చూపించారు. ఆవిడ డ్రామా ఆర్టిస్ట్. చిన్నారి ప్రతిభ చూసిన దర్శకుడు సి. పుల్లయ్య 'సతీ అనసూయ' (1936) సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు.
బాలనటిగా కెరీర్ బాగుండడంతో పాటు మరిన్ని అవకాశాలు రావడంతో 1939లో చెన్నైకి కృష్ణవేణి షిఫ్ట్ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ సినిమాలలోనూ నటించారు.
మీర్జాపురం రాజా వారితో వివాహం
చెన్నైకి షిఫ్ట్ అయిన ఏడాదే కృష్ణవేణి వివాహం కూడా జరిగింది. ఆమె మీర్జాపురం రాజా వారితో ఏడు అడుగులు వేశారు. భర్త సహకారంతో, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ శోభనాచల స్టూడియోస్ పతాకంపై పలు చిత్రాలను నిర్మించారు. మరోవైపు కథానాయికగా కూడా కొనసాగారు. కృష్ణవేణి నటించిన సినిమాలలో 'భక్త ప్రహ్లాద', 'భీష్మ', 'బ్రహ్మ రత్నం', 'గొల్లభామ', 'మన దేశం', 'పేరంటాలు' వంటివి ఉన్నాయి.
'మన దేశం'తో ఎన్టీఆర్ తెరంగేట్రం
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Sr NTR)ను 'మన దేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి సొంతం. ఆ సినిమాను కృష్ణవేణి భర్త మీర్జాపురం రాజా, మేక రంగయ్య నిర్మించారు. సంగీత దర్శకుడిగా ఘంటసాల వెంకటేశ్వర రావు, నేపథ్య గాయనిగా పి లీలను సైతం తెలుగు తెరకు పరిచయం చేసినది కృష్ణవేణి. తెలుగు చిత్రసీమ తొలినాళ్లలో తనదైన ముద్ర వేసిన కథానాయిక, నిర్మాత మరణం పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: క్రిస్టియన్ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్... వైట్ గౌనులో ఏంజెల్‌లా మహానటి
మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతులకు రాజ్యలక్ష్మి, అనురాధ జన్మించారు. తల్లి బాటలో నడుస్తూ అనురాధ చిత్ర నిర్మాణంలో ప్రవేశించారు. నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలను ఆవిడ నిర్మించారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రోజు ఉదయం తమ మాతృమూర్తి తుది శ్వాస విడిచినట్లు శ్రీమతి అనురాధ వెల్లడించారు.
నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో, 2004లో శ్రీమతి కృష్ణవేణిని రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించారు. ఇటీవల ఎన్టీఆర్ వజ్రోత్సవాలు జరిగినప్పుడు గతేడాది డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా శ్రీమతి కృష్ణవేణికి సత్కారం జరిగింది.
Also Read: హే చికీతా... కొత్త సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీకి ఛాన్స్ - ప్రేమికుల రోజున షూటింగ్ షురూ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

