Thala Song: తెలుగులో 'బిగ్ బాస్' ఫేమ్ భోలే షావలీ... తమిళంలో శింబు ఫాదర్ - ‘తల’లోని ‘ప్రేమ కుట్టిందంటే’
‘నమ్మొద్దు నమ్మొద్దూ ఆడవాళ్లను నమ్మొద్దు’ పాట ఎంత పెద్ద హిట్టయిందో, అంతకు మించిన పాటను అమ్మ రాజశేఖర్ రూపొందించారు. ‘ప్రేమ కుట్టిందంటే’ అంటూ వచ్చిన ఈ పాట లిరిక్స్, సింగర్స్ ఇలా ఒకటేమిటి.. అన్నీ స్పెషలే

‘రణం’ సినిమాతో దర్శకుడిగా సక్సెస్‌ని అందుకున్న అమ్మ రాజశేఖర్.. ఆ తర్వాత రెండు మూడు ప్రయత్నాలు చేసినా.. సరైన బ్రేక్ అందుకోలేకపోయాడు. మధ్యలో బిగ్‌బాస్ షో లో హడావుడి చేసిన అమ్మ రాజశేఖర్.. ఇప్పుడు తన కొడుకుని హీరోగా పరిచయం చేసేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాడు. ఈసారి తలలు తెగాల్సిందే.. అనేలా ‘తల’ అనే టైటిల్‌తో తన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్‌ని హీరోగా ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్.. అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అని మాట్లాడుకునేలా చేయగా.. ప్రమోషన్స్ పరంగానూ ఈ సినిమాను టాప్ ప్లేస్‌లో ఉంచుతున్నాడు అమ్మ రాజశేఖర్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ బీభత్సమైన స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.
‘రణం’ తర్వాత చేసిన ప్రయత్నాలతో విసిగిపోయిన అమ్మ రాజశేఖర్ ఈసారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ కొట్టాలని కసిగా ‘తల’ని తెరకెక్కించాడనేది ట్రైలర్‌తోనే చెప్పేశాడు. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి.. ఏదో రకంగా ఈ సినిమా వార్తలలో నిలుస్తూనే ఉంది. ట్రైలర్ విడుదల చేశాం కదా.. అదే చూసుకుంటుందిలే అని కూర్చోకుండా.. మ్యాగ్జిమమ్ సినిమాను వార్తలలో ఉంచేలా అమ్మ రాజశేఖర్ అండ్ టీమ్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. విజయవాడ అన్నా క్యాంటిన్‌లో భోజనం చేస్తూ.. ఆకర్షించిన టీమ్.. ఇప్పుడు చిత్రంలోని ‘ప్రేమ కుట్టిందంటే’ వీడియో సాంగ్‌ని విడుదల చేసి మరోసారి వార్తలలో హైలెట్ నిలిచేలా చేశారు. అయితే ఈ పాటకి ఓ ప్రాముఖ్యత ఉండేలా.. టీమ్ భలే ప్లాన్ చేసింది. అదేంటంటే.
‘తల’ సినిమాలోని ‘ప్రేమ కుట్టిందంటే’ పాట వినగానే ఎక్కేసేలా కంపోజ్ చేశారు. బిగ్ బాస్ ఫేమ్, ఎనర్జిటిక్ సింగర్ భోలే షావలీ పాడిన ఈ గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ స్వయంగా రచించడంతో పాటు, క్యాచీ ట్యూన్స్‌తో ఈ పాటను రూపొందించాడు. భోళే షావలీ వాయిస్ ఈ పాటకు పర్ఫెక్ట్ అనేలా సెట్ అయింది. తెలుగులో ఓకే.. మరి తమిళ్‌లో ఆ పాటని ఎవరు పాడారని అనుకుంటున్నారా. అక్కడ కూడా ఈ పాటకు విశిష్టత కల్పించేలా.. తమిళ్‌లో మల్టీ టాలెంటెడ్ లెజెండరీ పర్సనాలిటీ అయిన టి రాజేందర్ ఈ పాటను పాడటం విశేషం. హుషారైన పాటలను పాడటంలో టి. రాజేందర్ పెట్టింది పేరు. అందుకే ఈ పాట తమిళ్‌లోనూ ఊపేస్తోంది. టి. రాజేందర్ అంటే ఎవరో కాదు.. హీరో శింబు వాళ్ల ఫాదర్. ఒకప్పుడు గొప్ప గొప్ప ప్రేమకథలతో సినిమాలు చేసిన మల్టీ టాలెంటెడ్ పర్సన్.
ఇక ఈ పాటను కమెడియన్ ముక్కు అవినాష్‌పై అమ్మ రాజశేఖర్ చిత్రీకరించారు. ప్రేమలో పడితే ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు ఎలా ఉంటాయో అతను వివరిస్తున్నట్టుగా ఉందీ పాట సాహిత్యం. ‘రణం’ చిత్రంలో అలీపై చిత్రీకరించిన ‘నమ్మొద్దు నమ్మొద్దూ ఆడవాళ్లను నమ్మొద్దు’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించి హిట్ అయ్యేలా ఈ పాట దూసుకెళుతుంది. ‘చీమ ఎక్కడ కుడితే అక్కడే మంట పుడుతుందయా.. దోమ కుట్టిందంటే వస్తుంది మలేరియా.. కానీ ప్రేమ కుట్టిందంటే పిచ్చెక్కిపోతుందయా’ అంటూ మొదలైన ఈ పాటలో ఈ తరం యూత్‌ను ఆకర్షించేలా ఉంది సాహిత్యం. ప్రేమలో పడితే అమ్మాయిలు పెట్టించే ఖర్చులు, వారు పెట్టే ఇబ్బందులు తెలుపుతూ ఆఖర్లో ప్రేమ గురించి అడిగితే ‘హూ ఆర్ యూ’ అందిరా అంటూ వచ్చే ఫినిషింగ్ టచ్ ఇప్పటి జనరేషన్‌కు అవసరం అనేలా బాగా పిక్చరైజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ తెలుగు, తమిళ భాషల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: డైరెక్టుగా ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ETV Winలో హుషారు పోరి సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

