TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Telangana News | తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవో విడుదలైంది. దాంతో దేశంలో ఈ చర్య చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

SC Classification In Telangana | హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణలో సోమవారం నాడు కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీఓను విడుదల చేసింది. మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించారు. విద్య, ఉద్యోగాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్-1గా, మధ్యస్తంగా లబ్ధిపొందిన కులాలను గ్రూప్-2గా, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్-3లో చేర్చినట్లు ఎస్సీ వర్గీకరణ జీవోలో పేర్కొన్నారు.
గ్రూప్ ఏలో ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్, గ్రూప్ బీ లో ఉన్న వారికి 9 శాతం, గ్రూప్ సీలో ఉన్న వారికి 5 శాతంగా రిజర్వేషన్ అమలు చేయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణలో కీలక ఘట్టమైన జీవోను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. చెప్పినట్లుగానే ఏప్రిల్ 14న ఎస్సీల ఉపకులాలను 3 వర్గాలుగా వర్గీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
సీఎం రేవంత్‌కు జీవో కాపీ అందజేత
ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ వర్గీకరణ జీవో తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు ఉత్తం, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు.
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వారిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తదితరులు ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి జీవో మొదటి కాపీ
ఇప్పటికే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం లభించగా, ఆ బిల్లుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సైతం ఆమోదం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో ఆదివారం సమావేశం అయింది. ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ సోమవారం మరోసారి బేటీ కానుందని తెలిపారు. సోమవారం ఉదయం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జి.ఓ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ జీవో మొదటి కాపీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్యాబినెట్ సబ్ కమిటీ అందజేయనుంది.
వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ 199 పేజీల నివేదికను ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో 59 కులాల రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై వివరణాత్మక చర్చలోని అంశాలను పేర్కొన్నారు. 2024 నవంబరు 11న బాధ్యతలు స్వీకరించిన షమీమ్ అక్తర్ కమిషన్ 82 రోజులలో తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రజల నుంచి వచ్చిన 4,750 విజ్ఞప్తులు, ఆఫీసులకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్లో వచ్చిన 8,681 వినతులను పరిశీలించిన అనంతరం ఎస్సీ ఉపకులాలను 3 కేటగిరీలుగా వర్గీకరించాలని ప్రతిపాదన చేసింది.






















