Reason for Explosion: అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
Anakapalli Firecracker making unit | ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడుకు ఓ కార్మికుడు బలంగా పదార్థాన్ని దంచడమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

Andhra Pradesh News | కోటవురట్ల: అప్పటివరకూ ఎంతో ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారు. మరికాసేపట్లో మధ్యాహ్నం భోజనం చేయాలని మాట్లాడుకున్నారు. అంతలోనే భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలుడు.. దాంతో 5 మంది అక్కడే చనిపోయగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా కోటరవుట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. మరికొందరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఏపీ ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఎప్పటిలాగే క్రాకర్స్ తయారుచేస్తున్నారు. ఆదివారం కావడంతో 16 మంది కార్మికులు పనిలోకి వచ్చారు. మరికాసేపట్లో భోజన విరామం తీసుకుందాం అనుకున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మనోహర్ అనే కార్మికుడు బాణసంచాకు ఉపయోగించే ముడి సరుకును దంచుతున్నారు. ఈ క్రమంలో వేగం పెంచి, ఎక్కువ బలం ఉపయోగించి దంచడంతో అక్కడ అధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యింది. అసలే పేలుడు స్వభావం ఉన్న పదార్థాలు కావడంతో వేడికి చిన్న నిప్పు రవ్వ ఏర్పడింది. అది మందుగుండు సామగ్రిపై పడటంతో గత కొన్నిరోజుల నుంచి తయారుచేస్తున్న పదర్ధాలపై పడటంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, శరీర భాగాలు..
పేలుడు ధాటికి విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ రేకుల షెడ్డు, గోడలు ధ్వంసమయ్యాయి. షెడ్డు కింద, దాని చుట్టుపక్కల శిథిలాల కింద కార్మికులు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొందరి శరీర భాగాలు వేరయి అక్కడ భయానక వాతావరణం నెలకొంది. మొదట అక్కడ ట్రాన్స్‌ఫార్మర్ లాంటిది పేలిపోయిందని స్థానికులు అనుకున్నారు. తీరా వెళ్లి చూస్తే జరగరాని ఘోరం జరిగిపోయింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 4 గంటలకుపైగా శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. కొందరు కార్మికులను విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించగా, మరో ఇద్దరిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.
మొదట ప్రమాదాన్ని గుర్తించింది ఎవరు..
విజయలక్ష్మీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులు పురం పాప, దాడి రామలక్ష్మి, గుప్పిన వేణుబాబు, హేమంత్, సేనాపతి బాబూరావు ప్రమాదం జరిగిన సమయంలోనే మృతిచెందారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలు లేనట్లుగా డెడ్ బాడీస్ కాలిపోయాయి. షెడ్డు ఇటుకలు 300 మీటర్ల దూరం ఎగిరిపడ్డాయని సమాచారం. అంటే ప్రమాదం తీవ్రతను ఇది తెలుపుతుంది. మొదట ఓ రైతు గుర్తించి, స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకున్నా మంటల తీవ్రత అధికంగా ఉండటంతో కార్మికులకు సహాయం చేసేందుకు సాహసం చేయలేకపోయారు.
పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న దేవర నిర్మల, తాతబాబు, సంగరాతి గోవింద్ లను కోటవురట్ల హాస్పిటల్‌కు తరలించగా కాసేపటికే ముగ్గురు చనిపోయారు. ఐదుగురి మృతదేహాలను నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్‌కు, ముగ్గురి మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్గం కోసం తరలించారు.






















