Indravelli Meeting: ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయండి- ఖానాపూర్ ఎమ్మెల్యే
Adilabad News | ఇంద్రవెల్లి అమరుల వీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.1 కోటి మంజూరు చేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు.

ఆదిలాబాద్: ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju) కోరారు. సభ స్థలాన్ని జిల్లా ఎస్పీ, ఎఎస్పీ ,స్తూపం కమిటీ సభ్యులతో కలసి పరిశీలించారు. 1981 ఏప్రిల్ 20 నాడు హక్కులకై పోరుబాట పట్టి అసువులు బాసిన అమరుల వీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం 1 కోటి రూపాయలను మంజూరు చేసి అభివృద్ధి పనులను చేపట్టిందని ఖానాపూర్ (Khanapur) నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ... దళిత గిరిజన దండోరా సభలో అమరవీరులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారని, అమర వీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఈ సభకు జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క రానున్నట్లు తెలిపారు.
వచ్చే ఏప్రిల్ 20న జరిగే ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో అమరవీరుల కుటుంబాలకు ట్రైకార్ ద్వారా 10 లక్షల లోన్లు ఇస్తామన్నారు. శాంతియుత వాతావరణంలో అమరవీరులకు నివాళులు అర్పించాలని, ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. పూర్వ ఇంద్రవెల్లి రగల్ జెండా కమిటి యధావిదిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏ.ఎస్పీ కాజల్ సింగ్, ఆదివాసీ పెద్దలు సార్మేడిలు, ఆయా గ్రామాల పటేళ్లు, రగల్ జెండా కమిటి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

