Ram Charan on Fans Death: అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
Ram Charan Announces Financial Aid: రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ వేడుకను చూసి ఇంటికి వెళుతూ దారిలో ప్రమాదానికి గురై, మృతి చెందిన అభిమానుల కుటుంబానికి రామ్ చరణ్ ఆర్థిక సాయం ప్రకటించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాజమండ్రిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుక చూసిన అనంతరం ఇంటికి వెళుతూ ఇద్దరు అభిమానులు ప్రమాదానికి గురై మృతి చెందారనే విషయం సోమవారం బయటకు వచ్చింది. ఆ ఇద్దరి మృతిపై ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ స్పందించి, ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ.. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు. వారి మృతిపై చిత్ర హీరో రామ్ చరణ్ స్పందిస్తూ.. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి సన్నిహితులను తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారని, వారి కుటుంబాలకు చెరొక ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్ కల్యాణ్ కోరుకునేది కూడా అదే. ఆ విషయాన్ని ఈవెంట్‌లో కూడా ఒకటికి రెండు సార్లు బాబాయ్ చెప్పారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకు అంతే బాధగా ఉంది. చనిపోయి అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.
ఒకటికి రెండు సార్లు విజ్ఞప్తి చేసినా..
ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో ఒకటికి రెండు సార్లు విజ్ఞప్తి చేశా. అయినా ఇలా జరగడం నన్ను కలిచి వేసింది. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. ప్రభుత్వం తరపున తగిన సహాయం అందించేలా చూస్తామని తెలిపారు.
నిర్మాత దిల్ రాజు ఆర్థిక సాయం
శనివారం రాత్రి రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక, ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో ఇద్దరు మెగా అభిమానులు ప్రమాదవశాత్తు మృతి చెందారని తెలిసింది. ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాను. ఆ ఇద్దరి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నా తరపున వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాను. ఆ ఇరువురి కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను.. అని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.