Nagarjuna in Pakistan: పాకిస్థాన్‌లో నాగార్జునను పోలిన వ్యక్తి - వీడియోలతో లక్షల్లో సంపాదన
Nagarjuna Doppelganger: సీనియర్ హీరో నాగార్జున పోలికలు ఉన్నందుకు ఒక వ్యక్తి నెలకు రూ.4 నుండి 5 లక్షలు సంపాదిస్తున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన అతడు.. ప్రస్తుతం ఫుడ్ వ్లాగ్స్ చేస్తున్నాడు.
Nagarjuna Doppelganger in Pakistan: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటుంటారు. అది పాత మాట. కానీ ఈరోజుల్లో అలా మనిషిని పోలిన మరో మనిషి కనిపిస్తే వారికి డోపెల్గాంగర్ అని ట్యాగ్ ఇచ్చి.. వారిని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల పోలికలతో ఎవరు ఉన్నా.. వారు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నారు. తాజాగా సీనియర్ హీరో నాగార్జున పోలికలతో పాకిస్థాన్‌లో ఒక వ్యక్తి ఉన్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాకుండా హీరో పోలికలతో ఉండడం వల్ల అతడు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నాగార్జున పోలికలు..
ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వల్ల రీల్స్ అనేవి చాలా ఫేమస్ అయిపోయాయి. రీల్స్ చూడడం, చేయడం అందరి లైఫ్‌లో ఒక భాగమయిపోయింది. కానీ ఒకప్పుడు రీల్స్ స్థానంలో టిక్ టాక్ ఉండేది. అలా 2019లో పాకిస్థాన్‌కు చెందిన జైన్ అక్మల్ ఖాన్ అలియాస్ షికారీ మాస్ అనే వ్యక్తి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు. అదే సమయంలో తను ఇండియన్ యాక్టర్ నాగార్జునలాగా ఉన్నాడంటూ ఎక్కువగా కామెంట్స్ వస్తుండేవి. దీంతో అసలు నాగార్జున ఎవరు అని పూర్తిగా వివరాలు తెలుసుకున్నాడు. కాస్త లుక్స్ మార్చి మేకప్ వేసి నాగార్జున స్టైల్‌ను కాపీ కొట్టి వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అలా ఫేమస్ అయ్యి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు.
View this post on Instagram
యూట్యూబ్‌లో ఫేమస్..
టిక్ టాక్ వీడియోలతో మొదలయిన షికారీ మాస్ ప్రయాణం.. ప్రస్తుతం ఫుడ్ రివ్యూ వీడియోల వరకు వెళ్లిపోయింది. షికారీ మాస్ ఇప్పుడు పూర్తిగా ఫుడ్ బ్లాగర్‌గా మారిపోయాడు. వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ అక్కడ ఫేమస్ ఫుడ్స్‌ను ట్రై చేస్తూ అవి ఎలా ఉన్నాయో తన ఫాలోవర్స్‌కు రివ్యూ ఇస్తుంటాడు. ప్రస్తుతం తన ఫుడ్ వ్లాగ్స్ చాలా ఫేమస్ అయిపోయాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు వెయ్యి మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నా.. యూట్యూబ్‌లో మాత్రం 20 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో తన సంపాదన కచ్చితంగా లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. పాకిస్థానీ ఫుడ్ వ్లాగర్‌గా ఫేమస్ అయినందుకు తాజాగా అక్కడ ఒక లోకల్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు షికారీ మాస్.
నెల సంపాదన ఎంతంటే..?
తనకు నాగార్జున లాగా ఉండడం బాగా కలిసొస్తుందని చెప్పుకొచ్చాడు షికారీ మాస్. తను ఆదాయం కోసం కేవలం ఫుడ్ వీడియోలపైనే ఆధారపడతానని, వాటితోనే నెలకు రూ. 4 నుండి 5 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పి అందరికీ షాకిచ్చాడు. ప్రస్తుతం తన జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుందని తెలిపాడు. ఇప్పటికే ఇలా హీరోహీరోయిన్ల పోలికలు ఉన్న పలువురు సోషల్ మీడియా ద్వారా చాలా ఫేమస్ అయిపోతున్నారు. బాలీవుడ్ హీరోహీరోయిన్లను పోలిన మనుషులు.. ఏకంగా సినిమాల్లోకి కూడా వచ్చేస్తున్నారు. అలా నాగార్జున పోలికలతో ఉండడం షికారీ మాస్‌కు బాగా ప్లస్ అయ్యింది. ఫుడ్ వ్లాగర్‌గా తన లైఫ్‌ను సెటిల్ చేసేసింది.