UGC-PhD Admissions: 'నెట్' స్కోర్‌తో పీహెచ్‌డీ ప్రవేశాలు, యూజీసీ ఛైర్మన్ వెల్లడి
దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. పీహెచ్‌డీ ప్రవేశపరీక్షల స్థానంలో నెట్ స్కోరును తీసుకోవాలని పేర్కొంది.
PhD Admissions: దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. పీహెచ్‌డీ ప్రవేశపరీక్షల స్థానంలో నెట్ స్కోరును తీసుకోవాలని పేర్కొంది. పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయ ప్రవేశ పరీక్షతోపాటు నెట్ నిబంధనలను సమీక్షించడానికి యూజీసీ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. 2024-25 నుంచి నెట్ స్కోరుతో ప్రవేశాలు కల్పించాలని వెల్లడించింది. జేఆర్‌ఎఫ్‌తో పీహెచ్‌డీ ప్రవేశం, సహాయ ఆచార్యుల నియామకం, పీహెచ్‌డీ ప్రవేశాలకు నెట్ అభ్యర్థులను మూడు కేటగిరీల్లో అర్హులుగా ప్రకటిస్తామని వెల్లడించింది. ఇందులో 2, 3 కేటగిరీ అభ్యర్థులకు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నెట్ స్కోరుకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థులు పొందిన NET మార్కులు Ph.D కోసం ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటాయి. ఈ మేరకు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ 'ఎక్స్'లో ట్వీట్ చేశారు.
గతేడాది డిసెంబరులో నిర్వహించిన యూజీసీ నెట్ డిసెంబరు 2203 పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 6.95 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 292 నగరాల్లో డిసెంబరు 6 నుంచి 14 వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్ష ఫలితాలను 2024 జనవరి 17న విడుదల చేశారు.
From the academic session 2024-2025, all universities can use NET score for admission to PhD programmes in place of entrance tests conducted by the different universities/HEIs. NTA is working on launching the NET application process for June 2024 session sometime next week. pic.twitter.com/IVzKgu56gB
— Mamidala Jagadesh Kumar (@mamidala90) March 27, 2024
పీజీ లేకున్నా 'పీహెచ్‌డీ'లో చేరొచ్చు.. ఇప్పటికే యూజీసీ అనుమతి..
ఉన్నతవిద్యలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, డిగ్రీ (నాలుగేళ్లు) లాంటి కోర్సులు చేసిన అభ్యర్థులకు పీజీ అవసరం లేకుండానే పీహెచ్‌డీ చేసేందుకు యూజీసీ అవకాశం కల్పించింది. పీహెచ్‌డీ ప్రదానానికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తూ యూజీసీ కొత్త నిబంధనలు జారీచేసింది. దీనిప్రకారం విద్యార్థులకు పీజీ డిగ్రీతో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని కల్పించనుంది. దీనికోసం నాలుగేళ్లు లేదా 8 సెమిస్టర్లు ఉన్న డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే నాలుగేళ్ల డిగ్రీ అనంతరం మాస్టర్స్ డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసినవారు కూడా ఇందుకు అర్హులని తెలిపింది. ఇలాంటి వారికి కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. 55 శాతం మార్కులతో ఎంఫిల్ పూర్తిచేసిన వారూ
పీహెచ్‌డీలో చేరడానికి అర్హులే..
ఈ అన్ని విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్‌క్రిమీలేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి మార్కుల్లో 5 శాతం మినహాయింపు ఉంటుంది. దీనిపై యూజీసి మార్గదర్శకాలు విడుదల చేసింది. వాస్తవానికి అక్టోబర్ మొదటి వారంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. ఆలస్యమైంది. ఇది అమలైతే బీఈ, బీటెక్, బీ ఫార్మసీ తదితర కోర్సులు చేసిన విద్యార్థులు పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని పొందొచ్చు.
పీహెచ్‌డీ కాలపరిమితి ఆరేళ్లు..
ఇకమీదట పీహెచ్‌డీ కాలపరిమితి కనీసం మూడేళ్లు, గరిష్ఠంగా ఆరేళ్లు ఉంటుంది. రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా గరిష్ఠంగా 2 ఏళ్ల అదనపు సమయం ఇస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీహెచ్‌డీ పూర్తికి 8 ఏళ్ల పరిమితి మించకూడదు. మహిళలు, దివ్యాంగుల (40శాతానికి మించి వైకల్యం ఉన్నవారు)కు మరో 2 ఏళ్ల పరిమితి ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ఇలాంటివారు పీహెచ్‌డీలో చేరిన నాటి నుంచి పదేళ్లలో దాన్ని పూర్తిచేయడానికి వీలుంటుంది. మహిళా అభ్యర్థులు పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో 240 రోజులపాటు ప్రసూతి, శిశుపాలన సెలవులు తీసుకోవచ్చు.
యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్, గేట్, సీడ్ లాంటి జాతీయస్థాయి ప్రవేశపరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను పీహెచ్‌డీలో చేర్చుకోవచ్చు. లేదంటే ఉన్నత విద్యాసంస్థలు తాము సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించి కూడా ప్రవేశాలు కల్పించవచ్చు. అయితే ఆ పరీక్ష 50 శాతం రీసెర్చ్ మెథడాలజీ, 50శాతం సంబంధిత సబ్జెక్టు ఆధారంగా ఉండాలి. ఈ ప్రవేశ పరీక్షల్లో 50శాతం మార్కులు సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూలకు పిలవొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5శాతం మార్కుల మినహాయింపు ఉంటుంది. అందుబాటులో ఉన్న పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను బట్టి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచే స్వేచ్ఛ ఉన్నత విద్యాసంస్థలకు ఉంటుంది. ఆ సంస్థలు నిర్వహించిన ప్రవేశపరీక్ష ద్వారా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి ఉంటే ప్రవేశపరీక్షలో సాధించిన మార్కులకు 70శాతం, ఇంటర్వ్యూలో ప్రదర్శించే ప్రతిభకు 30శాతం వెయిటేజీ ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రచురణ తప్పనిసరి కాదు..
ఇదిలా ఉంటే.. పీహెచ్‌డీ కోర్సులు ఏవి కూడా ఆన్‌లైన్ మోడ్ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉండవని యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పేర్కొంది. అలాగే ప్రస్తుతం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందాలంటే మాస్టర్స్ డిగ్రీ తప్పనిసరి. ఇదే కాకుండా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది యూజీసీ.. థీసిస్ సమర్పణకు ముందుగా రీసెర్చ్ పేపర్స్ ప్రచురణ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. మరోవైపు యూజీసీ మరో నిర్ణయం ప్రకటించింది. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ABC) ప్రోగ్రామ్‌లో భాగంగా డిగ్రీ కోర్సుల్లో మల్టిపుల్ ఎంట్రీ- ఎగ్జిట్ సౌలభ్యాన్ని విద్యార్థులకు కల్పించనుంది. మూడేళ్ల డిగ్రీ కోసం కాలేజీలో చేరి సంవత్సరం తరువాత ఒక సర్టిఫికేట్ పొంది బయటకు వెళ్లిపోవచ్చు. అనంతరం కొన్నేళ్ల తరువాత మిగతా రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సును పూర్తి చేయడానికి మళ్లీ కాలేజీకి రావచ్చు. 'అత్యవసర ప్రాతిపదికన' అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ విధానాన్ని అమలు చేయాలని కళాశాలలు, యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలను యూజీసీ కోరింది.