Vijayasai Reddy: సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి - మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో సీఐడీ ఎదుట విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో తనకు చాలా తెలుసని అన్నీ చెబుతానని గతంలోనే ప్రకటించారు.

Vijayasai Reddy appears before CID in AP liquor scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సాక్షిగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఐడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం పదిన్నరకు రావాల్సిన ఆయన లంచ్ తర్వాత రెండు గంటలకు వచ్చారు. గతంలో ఆయన లిక్కర్ స్కాంకు కర్త, కర్మ, క్రియ .. అప్పట్లో ఐటీ సలహాదారుగా పని చేసిన రాజ్ కసిరెడ్డేనని ప్రకటించారు. సీఐడీ అధికారులు అడిగితే అన్నీ చెబుతానన్నారు. ఈ క్రమంలో ఆయనను సాక్షిగా పిలిచినట్లుగా భావిస్తున్నారు.
పరారీలో రాజ్ కసిరెడ్డి
రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన కోసం ఐదారు బృందాలు హైదరాబాద్‌లో సోదాలు చేస్తున్నాయి. ఆయన పెట్టుబడి పెట్టిన కంపెనీల్లోనూ విచారణ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో పెట్టుబడులు, సినిమా నిర్మాణానికి నిధులు రాజ్ కసిరెడ్డి ఇచ్చారని గుర్తించారు. అలాగే పెద్ద ఎత్తున విల్లాలు, ఇతర ఆస్తులు కొనుగోలు చేశారు. విచారణకు పిలిచినా హాజరు కాకపోవడంతో ఇప్పటికి నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన తండ్రికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణకు హాజరయ్యారు. ఇతర బంధువులతో కలిసి రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నారు.
సాక్షిగా పూర్తి వివరాలు వెల్లడించనున్న విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి ... లిక్కర్ స్కాం మొత్తానికి రాజ్ కసిరెడ్డే సూత్రధారి అని చెప్పడంతో దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వద్ద నుంచి తీసుకునే అవకాశం ఉంది. అయితే విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ కూడా ఏపీ లిక్కర్ స్కాంలో ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో టీడీపీ నేతలు ఈ ఆరోపణలు చేశారు. అయితే ఈ స్కాంతో తనకు సంబంధం లేదని.. తన అల్లుడు, అతని కుటుంబ వ్యాపారాలతో తనకు అసలు సంబంధంలేదని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.
జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి బయట పెట్టబోయే అంశాలు సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు వైసీపీ నేతలకు సన్నిహితుడు కాదు. జగన్ చుట్టూ కోటరీ ఉందని ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చారు. వైసీపీ నుంచి వచ్చిన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పటి వరకూ ఆయన జగన్ కోటరీపై విమర్శలు చేస్తున్నారు కానీ.. జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ క్రమంలో ఆయన జగన్ కు వ్యతిరేకంగా లిక్కర్ స్కాంలో ఎలాంటి వివరాలు చెప్పే అవకాశం లేదని భావిస్తున్నారు.
లిక్కర్ స్కాంలో ఎంత మంది పాత్రధారులు ఉన్నా.. అసలు సూత్రధారి మాత్రం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకే స్కాం డబ్బుల్లో సింహ భాగం చేరిందని అంటున్నారు. అవన్నీ బయటపడతాయనే పెద్ద ఎత్తున నిందితుల్ని పరారీ అయ్యేందుకు సహకరిస్తున్నారని చెబుతున్నారు.





















