Simhachalam Chandanotsavam 2025: వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజ రూపం ఎలా ఉంటుందో తెలుసా..చందనోత్సవం ఎందుకు చేస్తారు!
Chandanotsavam 2025: ప్రతి సంవత్సం వైశాఖమాసంలో పౌర్ణమి ముందు వచ్చే తదియ రోజు సింహాచలం వరాహ లక్ష్మీనారసింహ స్వామి చందనోత్సవం జరుగుతుంది. ఈ రోజు నిజరూపం చూసే భాగ్యాన్ని కల్పిస్తారు..

Simhachalam Chandanotsavam 2025: దేశవ్యాప్తంగా నారసింహ స్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి. కానీ వరాహం, నారసింహ అవతారాలు కలిసున్న విగ్రహం కేవలం సింహాచలంలో మాత్రమే ఉంది. ఈ స్వామిని దర్శించుకోవజడమే మహాభాగ్యంగా భావిస్తారు..అలాంటిది నిజరూప దర్శనం అంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది?
శ్రీమహావిష్ణువు...
హిరణ్యాక్షుడిని వధించేందుకు వరాహావతారాన్ని, హిరణ్యకశిపుణ్ని సంహరించేందుకు నృసింహావతారంలో వచ్చాడు. ముందుగా హిరణ్యాక్షుడిని వధించి వరాహ అవతారాన్ని వీడేలోగా...నీ స్వామి ఎక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు ప్రార్థించడంతో వరాహ అవతారాన్ని పూర్తిగా వీడక ముందే నృసింహుడిగా వచ్చేస్తాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత భీకరంగా మారిన నృసింహుడిని చూసి సృష్టి మొత్తం వణికిపోయింది. ఆ సమయంలో చందన వృక్షానికి ఇచ్చిన వరం బ్రహ్మకు గుర్తొస్తుంది. అలా చందనాన్ని తెప్పించడంతో ప్లహ్లాదుడు స్వామికి చందనసేవ చేస్తాడు. ఆ వేడి తగ్గి శాంతించాడు నృసింహస్వామి. ప్లహ్లాదుడి కోరిక మేరకు వరాహం, నృసింహ రూపంలోనే సింహాచలంలో కొలువయ్యాడు. ప్రహ్లాదుడి పిలుపుమేరకు ఒక్క ఉదుటున కిందకు దూకడంతో వరాహ నారసింహుడి పాదాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. అందుకే ఇక్కడ స్వామివారి పాదాలు కనిపించవు.
కొన్నాళ్లకు వరాహనారసింహుడి విగ్రహం పుట్టలో నిక్షిప్తమైపోయింది. ఆ తర్వాత కొంత కలానికి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా సింహాచలం దగ్గరకు వచ్చేసరికి విమానం ఆగిపోయింది. ఆ కొండల మహిమ గురించి దివ్యదృష్టితో తెలుసుకున్న ఊర్వశి... పురూరవుడికి వివరించింది. ఆ రాత్రికి అక్కడే బసచేసిన చక్రవర్తి కలలో కనిపించిన స్వామివారు తాను మట్టిపుట్టలో ఉన్న విషయం చెప్పారు. అలా 12 అడుగుల పుట్టలోంచి బయటపడిన విగ్రహానికి 12 మణుగుల చందనాన్ని దశలవారీగా సమర్పిస్తారు.
ఇది నిజం రూపం
వరాహ ముఖం, నరుడి శరీరం, తెల్లని జూలు, రెండు చేతులు, పాతాళంలో పాదాలు...ఇదీ స్వామివారి నిజరూపం. స్వామివారి అసలు రూపాన్ని చూసే అదృష్టం కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే ఉంటుంది. ఈ కొన్ని గంటల్లో స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరుతారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మళ్లీ చందనం లేపనం చేస్తారు. అప్పటివరకూ వరాహనారసింహుడిగా కనిపించిన స్వామివారు.. చందనం లేపనం తర్వాత లింగరూపంలో మారిపోతారు.
చందనోత్సవం ఇలా చేస్తారు
చందన పూత కోసం గంధపు చెక్కలను తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియ ప్రారంభిస్తారు
అక్షయతృతీయ ముందు రోజు అర్థరాత్రి నుంచి బంగారు బొరుగులతో స్వామివారిపై ఉన్న చందనాన్ని తొలగించడం ప్రారంభిస్తారు. తెల్లవారుజాము నుంచి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు
వరాహనారసింహుడి నిజరూపాన్ని మొదటగా దర్శించుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులదే
అక్షయతృతీయ రోజు రాత్రి వరకూ భక్తులకు దర్శన కల్పించిన తర్వాత అభిషేకం చేస్తారు. సింహాచలం కొండ మీదున్న గంగధార నుంచి 1000 కలశాలతో ‘సహస్ర ఘటాభిషేకం’ నిర్వహిస్తారు. అనంతరం 108 వెండి కలశాలతో పంచామృత అభిషేకం చేస్తారు
3 ముణుగులు ( మణుగు అంటే 40 కిలోలు) 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనంగా పూస్తారు. చందనం పూతతో స్వామివారు నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారతారు
12 మణుగుల చందనాన్ని ఒకేసారి కాకుండా అక్షయ తృతీయతోపాటు, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ, పౌర్ణమి తిథుల్లోనూ ఇలా నాలుగు విడతలుగా మొత్తం 12 మణుగులు సమర్పిస్తారు. లోకాలనేల స్వామి చల్లగా ఉంటే జగమంతా చల్లగా ఉంటుందని భక్తుల విశ్వాసం.
ఈ ఏడాది (2025) ఏప్రిల్ 30 చందనోత్సవం జరుగుతుంది






















