(Source: Poll of Polls)
Tirumala: రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
TTD Goshala Row: టీటీడీ గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి.

TTD Goshala : టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందినట్లు భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి. అర్థరహిత ఆరోపణలు చేశారని తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. TTD గోశాలపై అసత్య ప్రచారం చేయడం ద్వారా కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని భానుప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌లో భూమన కరుణాకర్ రెడ్డిపై భారత న్యాయసంహిత లోని సెక్షన్లు 353 (1), 299, ఐటీ చట్టంలోని సెక్షన్ 74 కింద కేసులు నమోదయ్యాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యలో ఉన్న గోశాలలో 3 నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయని TTD పాలకమండలి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా జరుగుతున్న ఈ గోమరణాల TTD దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ భూమన ప్రశ్నించారు. దేశంలో గోవును అత్యంత పవిత్రమైన జంతువుగా హిందువులు పూజిస్తారు.. సకల దేవతలు కొలువైన గోమాతకు TTD గోశాలలో దారుణమైన పరిస్థితి దాపురించిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై TDP రాష్ట్రశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించడం, భూమనకు సవాల్ విసరడంతో ఈ ఉదంతం మరో మలుపు తిరగింది. గోవుల మరణంపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించేందుకు గోశాలకు రావాలనే సవాల్ విసిరారు పల్లా శ్రీనివాస్. దీనికి స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వెళ్లేందుకు సిద్ధపడడంతో దుమారం రేగింది. ఈ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు SVU సీఐ రామయ్య పేర్కొన్నారు. TTD గోశాలపై అసత్య ప్రచారం చేస్తూ మీడియాను తప్పుతోవ పట్టించారని, హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని TTD పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఈ మేరకు కేసు నమోదైనట్టు సీఐ రామయ్య వెల్లడించారు.
TTD, అనుబంధ సంస్థలపై ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని ఈ సందర్భంగా హెచ్చరించారు భానుప్రకాశ్ రెడ్డి. టీటీడీ బోర్డు సభ్యుడిగా SVU పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేసి తీరుతాం అని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. TTD గోశాలలో సహజంగా గోవులు మరణిస్తే దానా సరిగా పెట్టలేదని, బక్కచిక్కిపోయాయని అసత్య ప్రచారం భక్తుల్లోకి తీసుకెళ్లి TTD ప్రతిష్ట ను దిగజార్చే విధంగా ప్రయత్నించారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పత్రికల్లో రాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ను కోరామని తెలిపారు.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















